పత్తి కొనుగోలు కేంద్రంలో ప్రైవేట్ దందా
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:06 AM
పత్తి కొనుగోలు కేంద్రంలో ప్రైవేట్ దందా కొనసాగుతోంది. పత్తి విక్రయాల్లో అక్రమాలను అరికట్టేం దుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా దళారులు కొత్త రకం ఎత్తులు వేస్తున్నారు.
రైతులు విక్రయించే పత్తికి అభ్యంతరాలు
దళారులు తెస్తే వెంటనే కొనుగోలు
కొంపల్లి సీసీఐ కేంద్రం నిర్వాహకుల ఇష్టారాజ్యం
మునుగోడు, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): పత్తి కొనుగోలు కేంద్రంలో ప్రైవేట్ దందా కొనసాగుతోంది. పత్తి విక్రయాల్లో అక్రమాలను అరికట్టేం దుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా దళారులు కొత్త రకం ఎత్తులు వేస్తున్నారు. రైతులను నమ్మబలికి బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు కొనుగోలు చేసిన పత్తిని రైతుల పేరున సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో దర్జాగా విక్రయిస్తున్నారు. అద్దె మిల్లులు నడుపుతున్న నిర్వాహకులతో కుమ్మక్కై ఈ దందా నడుపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బహిరంగంగా సాగుతున్న ఈ దందాపై అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం పరిధిలో దందా బహిరంగంగా సాగుతోంది. మర్రిగూడ మండలం లోని కొంపల్లిలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి జిన్నింగ్ మిల్లులో మంగళవారం ఉదయం 6గంటల సమయంలో 11డీసీఎం వాహనాల్లో దళారులు తెచ్చిన పత్తి దిగుమతి చేశారు. ఈ వ్యవహారంపై ప్రశ్నిస్తే సమాధానం చెప్ప కుండా దాటవేశారని కొందరు రైతులు చెబుతున్నారు. మరికొందరు ఫోన్‌లో ఫొటోలు తీసే క్రమంలో సీసీఐ స్లాట్ బుకింగ్ అంటూనే దాటవేస్తూ దిగుమతి చేసే డీసీఎం వాహనాలను మిల్లులోంచి బయటకు తరలిం చారు. ఏమిటని ప్రశ్నిస్తే సమాధానం దాట వేస్తున్నారు. ఆ సమ యంలో వందల సంఖ్యలో రైతులు తెచ్చిన పత్తి వాహనాలు మిల్లు ఎదుట బారులు తీరి ఉండడం గమ నార్హం. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తి దిగుమతులకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే. కానీ ఆ నిబంధనలు ఏమీ పట్టించుకోకుండా మిల్లు నిర్వాహకులు పత్తి దిగు మతి చేసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. రైతులు తెచ్చిన పత్తికి వివిధ రకాల సాకులు చెప్పడం, దళారులు తెచ్చిన పత్తికి మాత్రం అభ్యంతరం చెప్పకపోడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల అమాయకతను ఆసరా చేసుకొని తక్కువ ధరకు కొనుగోలు చేసిన పత్తిని మళ్లీ ఈ కొనుగోలు కేంద్రంలోనే రైతుల పేరునే విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిస్తున్నాయి.
స్లాట్ బుకింగ్‌లో రైతుల పేరున లెక్కకట్టి..
సీజన్ ఆరంభంలో డీసీఎం వాహనాల ద్వారా కొనుగోలు చేసుకొని వచ్చిన తర్వాత పరిసర ప్రాంతంలో అనువైన చోట ట్రాక్టర్లకు లోడ్ చేసుకొని విక్రయాలు సాగించారు. కొద్ది రోజులుగా డీసీఎం వాహనాలనే ఏకంగా కొనుగోలు కేంద్రంలోకి నేరుగా తీసుకొచ్చి సాగుతోందని తెలు స్తోంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తికి సీసీఐ కేంద్రంలో విక్రయించిన ధరకు సుమారు రూ.2వేల నుంచి రూ. 3వేల వరకు వ్యత్యాసం ఉంటుందని సమాచారం. ప్రతిరోజూ పదుల సంఖ్యలో డీసీఎం వాహనాలు తెచ్చి విక్రయాలు సాగిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. మిల్లు అద్దె నిర్వాహకులు అంతా తామై నడుపుతున్న ట్లు తెలుస్తోంది. గ్రామాల్లో రైతుల నుంచి దళారులు తక్కువ ధరకు కొనుగోలు డీసీఎం వాహానాల్లో తెచ్చిన పత్తిని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో దిగుమతి చేస్తున్నారు. తర్వాత రైతుల పేరున స్లాట్ బుకింగ్ చేసి అధికారంగా విక్రయాలు జరిపినట్లు లెక్కకట్టేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల్లో లొసుగులను ఆసరా చేసుకొన్న దళారులు మిల్లు నిర్వాహకులు కలిసి చేస్తున్నారని పలువురు అంటున్నారు.
ఈ వ్యవహారంపై కొంపల్లి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం బయ్యర్ నింజేను ఫోన్‌లో ప్రశ్నించగా కొనుగోలు కేంద్రంలో పత్తిని ఉదయం మాత్రమే కొనుగోలు చేస్తామని, రాత్రి వేళల్లో కొనుగోలు చేయబోమని సమాధానం దాటవేశారు.