Share News

Private Bus Safety: డ్రైవర్‌ దగ్గర అలారం ఉండాలి

ABN , Publish Date - Oct 25 , 2025 | 05:19 AM

ప్రైవేటు బస్సు ప్రమాదాలు చాలావరకూ మానవ తప్పిదాల వల్లే తలెత్తుతున్నాయని మాజీ ఆర్టీఏ అధికారి సీఎల్‌ఎన్‌ గాంధీ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో..

Private Bus Safety: డ్రైవర్‌ దగ్గర అలారం ఉండాలి

  • ముందు తలుపు ఆటోమాటిక్‌గా తెరుచుకోవాలి

  • వెనుక మరో ఆటోమాటిక్‌ డోర్‌ ఉండాలి

  • అగ్నినిరోధక పదార్థాలతో బస్సు నిర్మించాలి

  • రవాణా శాఖ మాజీ అధికారి గాంధీ

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు బస్సు ప్రమాదాలు చాలావరకూ మానవ తప్పిదాల వల్లే తలెత్తుతున్నాయని మాజీ ఆర్టీఏ అధికారి సీఎల్‌ఎన్‌ గాంధీ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం అదనపు కమిషనర్‌గా సేవలు అందించిన గాంధీ శుక్రవారం వేమూరి కావేరీ ట్రావెల్స్‌ ప్రమాదంపై ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. బస్సు లోపల సరైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుంటే ఇంతగా ప్రాణ నష్టం జరిగేది కాదన్నారు. ఏఐఎస్‌ 15 నియమ నిబంధనల ప్రకారం అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి డ్రైవర్‌ దగ్గర అలారమ్‌ బటన్‌ ఉండాలని చెప్పారు. అలాంటి ఏర్పాటు వేమూరి కావేరీ ట్రావెల్స్‌ బస్సులో ఉన్నట్లు కనబడటం లేదన్నారు. బస్సు బాడీ నిర్మాణంలోనూ అగ్ని నిరోధక పదార్ధాలు వాడాలని, అలాంటి జాగ్రత్తలేవీ తీసుకోలేదని వివరించారు. ముందు భాగంలోని తలుపులు ఆటోమేటిక్‌గా తెరుచుకోవాలని, అద్దాలు పగలగొట్టడానికి ప్రతి కిటికీ దగ్గర ఒక హ్యామర్‌ ఉంచాలని చెప్పారు. అత్యవసర తలుపులు సులభంగా తెరుచుకునేలా చూడాలని అన్నారు. బస్సు లోపలి భాగంలో మంటలను అదుపు చేసే పరికరాలుంచాలని తెలిపారు. అవేవీ లేవు కనుకే ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం ఎక్కువ జరిగిందన్నారు. ఈ నేరంలో బస్సు యాజమాన్యం, అధికార వ్యవస్థ, అసమగ్ర చట్టం మూడూ దోషులేనని వ్యాఖ్యానించారు.


  • మోటారు వాహనాల చట్టం ప్రకారం ముఖ్యంగా ప్రతి స్లీపర్‌ బస్సులో తగినన్ని అగ్నిమాపక యంత్రాలు అమర్చాలి. అత్యవసర ద్వారం సరైన స్థానంలో ఏర్పాటు చేయాలి. ప్రమాద సమయంలో ఆటోమేటిక్‌గా తెరుచుకొనే విధంగా ముందు, వెనుక భాగాల్లో రెండు ద్వారాలు ఉండాలి. అలారమ్‌ బటన్‌ కూడా తప్పనిసరి. వీటిని అస్సలు పట్టించుకోవడం లేదు. ధర తక్కువ కనుక ఫోమ్‌ బెడ్‌లు, కర్టెన్లు వాడుతున్నారు. అవి మంటల తీవ్రతను పెంచుతున్నాయి. ప్రయాణికులను అప్రమత్తం చేయడం డ్రైవర్‌ బాధ్యత. అందుకు వారికి తగిన అవగాహన, శిక్షణ అవసరం. ప్రయాణికులకు కూడా ప్రమాద సమయాల్లో ఎలా బయటపడాలని చెప్పే సమాచారం పోస్టర్ల రూపంలో బస్సులో ఉంచాలి. ఎక్కడెక్కడ డోర్లు ఉన్నాయి, ఎలా బయటపడాలని వివరించే బస్‌ ఇంటర్నల్‌ మ్యాప్‌ ఉంచాలి. విమానాల తరహాలో జాగ్రత్తలు ముందు చెప్పాలి.

  • వేమూరి కావేరీ ట్రావెల్స్‌ బస్సు డయ్యూ డామన్‌లో రిజిస్ట్రేషన్‌ చేశారు. ఫిట్‌నెస్‌, పర్మిట్‌ అనుమతులు అక్కడే తీసుకున్నారు. తిరిగేది హైదరాబాద్‌, బెంగళూరు మధ్య. ఆ బస్సును తనిఖీ చేసే అవకాశం ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు లేదు. రవాణా చట్టంలో ఇదో పెద్ద లోపం. తెలుగు రాష్ట్రాలలో అధికారులు పూర్తిగా పరీక్షించిన తర్వాతే అనుమతులు జారీ చేస్తారు కనుక నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ తదితర రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్‌ చేయించి, ఇతర అనుమతులు తెచ్చుకుంటున్నారు. బస్సు పరీక్షించడం, తనిఖీ చేయడం లాంటివేవీ లేకుండా కేవలం డబ్బు చెల్లిస్తే అనుమతి పత్రాలు పంపించే సంస్కృతి అక్కడ ఉంది.

  • మూడు నెలలకు ఒకసారైనా బస్సును రిజిస్టర్‌ చేసిన రాష్ట్రానికి తీసుకెళ్లాలని రవాణా చట్టంలో నిబంధన ఉండేది. రాజకీయ పలుకుబడితో దాన్ని తొలగించారు. హైదరాబాద్‌లో ఉంటూ అన్ని అనుమతులు తెప్పించుకుంటారు. ఉన్నాయా లేవా? అని తనిఖీ చేసే అధికారం తెలంగాణ అధికారులకు ఉన్నప్పటికీ జిల్లాకు ఇద్దరే బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండటం, ట్రావెల్స్‌ బస్సులు రాత్రిపూట మాత్రమే రోడ్డు మీదకు రావడంతో పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక వాహనం ఫిట్‌నెస్‌ చెక్‌ చేయడానికి సరైన సాధన సామగ్రి తెలంగాణ అధికారుల దగ్గర లేకపోవడంతో వేరే రాష్ట్రాల నుంచి పోస్టులో తెప్పించుకున్న సర్టిఫికెట్లను చూసి వదిలేయాల్సి వస్తోంది. ఆర్టీసీలో స్లీపర్‌ బస్సులపై నిరంతర పర్యవేక్షణ వల్ల ఇలాంటి ప్రమాదాలు తలెత్తిన దాఖలాలు లేవు.

  • ప్రైవేటు బస్సుల యజమానులతో ఆర్టీఏ అధికారులు నిరంతరం సమావేశాలు నిర్వహించి, నిబంధనలు పాటించడం మీద కచ్చితమైన మార్గనిర్దేశాలు జారీ చేయాలి. రూల్స్‌ అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయన్న స్పృహ కలిగించాలి. వాళ్ల వ్యాపారాలు వాళ్లు, వీళ్ల ఉద్యోగాలు వీళ్లు చేసుకొంటామంటే కర్నూలు తరహా విషాదాలు కొనసాగుతూనే ఉంటాయి.

Updated Date - Oct 25 , 2025 | 05:19 AM