Health Insurance Implementation: ఆరోగ్య బీమా ఇంకెన్నాళ్లకు?
ABN , Publish Date - Dec 26 , 2025 | 06:04 AM
దేవుడు వరమిచ్చినా... పూజారి కనికరించలేదు అన్న చందంగా మారింది జైళ్ల శాఖలో పరిస్థితి. యూనిఫాం సర్వీసులో భాగమైన జైళ్ల శాఖ సిబ్బందికి కూడా పోలీస్ సిబ్బంది మాదిరిగానే...
జైళ్ల శాఖ సిబ్బందికి ఆరోగ్య బీమా కోసం ఆగస్టులోనే జీవో జారీ
ఇప్పటివరకు దాని అమలుకు చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు
సొంత ఖర్చులతో వైద్యం చేయించుకొని ఆర్థికంగా నలిగిపోతున్న ఉద్యోగులు
హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ‘దేవుడు వరమిచ్చినా... పూజారి కనికరించలేదు’ అన్న చందంగా మారింది జైళ్ల శాఖలో పరిస్థితి. యూనిఫాం సర్వీసులో భాగమైన జైళ్ల శాఖ సిబ్బందికి కూడా పోలీస్ సిబ్బంది మాదిరిగానే ‘ఆరోగ్య భద్రత’ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్టు 19వ తేదీనే జీవో నెంబర్ 94 జారీ చేసినా.. ఇప్పటివరకు ఆ శాఖ ఉన్నతాధికారులు ఆరోగ్య భద్రత అమలుకు చర్యలు చేపట్టలేదు. జైళ్ల శాఖలో క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు సుమారు 1,600 మంది పనిచేస్తున్నారు. కరుడుగట్టిన ఖైదీల మధ్య, తీవ్ర ఒత్తిడితో విధులు నిర్వహించే సిబ్బంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారిలో చాలా మంది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేక వెనుకడుగు వేస్తున్నారు. ఆరోగ్య భద్రత లేకపోవడంతో సిబ్బంది చాలా వరకు ప్రైవేటు వైద్య బీమా చేయించుకుంటున్నారు.
రీయింబర్స్‌మెంటూ కష్టమే..
ప్రైవేటు బీమా లేని సిబ్బంది సొంత ఖర్చులతో చికిత్స చేయించుకొన్న తర్వాత రీయింబర్స్‌మెంటుకు దరఖాస్తు చేసుకోవాలి. రూ.1 లక్ష వరకు బిల్లు ఉంటే జైళ్ల శాఖ డీజీ నుంచి నేరుగా చెల్లింపులు జరుగుతాయి. అంతకంటే ఎక్కువ బిల్లులు ఉంటే ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిందే. అందుకు బిల్లు రీయింబర్స్‌మెంటు కమిటీ విచారించి ఆమోదించాల్సి ఉంటుంది. ఇది సుదీర్ఘ ప్రక్రియ. దీంతో చాలా మంది సిబ్బంది సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నా రీయింబర్స్‌మెంటు కోసం ఆసక్తి చూపించ టం లేదు. ఈ పరిస్థితుల్లో జైళ్ల శాఖ సిబ్బంది కొన్నేళ్లుగా చేసిన విన్నపాలను పరిశీలించిన ప్రభుత్వం గత ఆగస్టులో వీరి ఆరోగ్య బీమా కోసం ఉత్తర్వులు జారీ చేసింది. జైళ్ల శాఖ డీజీ చైౖర్మన్‌గా, ఐజీ వైస్ చైౖర్మన్‌గా మొత్తం 14 మందితో కమిటీ ఏర్పాటు చేసి సత్వరమే సిబ్బందికి ఆరోగ్య భద్రత వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆరోగ్య భద్రత స్కీం కోసం సీనియర్ అసిస్టెంట్, వార్డర్, డిప్యూటీ జైలర్ స్థాయి సిబ్బంది వరకు వారి జీతం నుంచి ప్రతినెలా 300 చెల్లించాలి. సూపరింటెండెంట్లు, జైలర్లు, పరిపాలనాధికారులు, డిప్యూటీ సూపరింటెండెంట్ నుంచి ఐజీ స్థాయి అధికారి వరకు రూ.400 చెల్లించాలి. కానీ, బీమా కోసం అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వ ఉత్తర్వులను అమలుచేసేందుకు చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.