President Draupadi Murmu: పశ్చిమ భారత వైభవానికి వేదిక
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:45 AM
పశ్చిమ భారత రాష్ట్రాల సంస్కృతిని ప్రత్యక్షంగా తెలుసుకునే అరుదైన అవకాశం భారతీయ కళా మహోత్సవం రూపంలో తెలంగాణ ప్రజలకు లభించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.....
‘భారతీయ కళా మహోత్సవం’ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ముర్ము.. రాష్ట్రపతి నిలయంలో 9 రోజుల పాటు ప్రదర్శన
నేటి నుంచి ప్రజలకు ఉచిత ప్రవేశం
బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతిని స్వాగతించిన గవర్నర్, సీఎం
హైదరాబాద్, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): పశ్చిమ భారత రాష్ట్రాల సంస్కృతిని ప్రత్యక్షంగా తెలుసుకునే అరుదైన అవకాశం భారతీయ కళా మహోత్సవం రూపంలో తెలంగాణ ప్రజలకు లభించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రపతి నిలయం, కేంద్ర సాంస్కృతిక శాఖ, కేంద్ర పర్యాటక శాఖల ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన 2వ భారతీయ కళా మహోత్సవాలను రాష్ట్రపతి ముర్ము శుక్రవారం ప్రారంభించారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ మహోత్సవంలో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, గోవా, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ రాష్ట్రాల సంప్రదాయ కళలు, సంగీతం, నృత్యం, సాహిత్యం, చేతివృత్తులు, వంటకాల వైభవాన్ని ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవాలను ప్రారంభించిన అనంతరం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. మొదటి విడత భారతీయ కళా మహోత్సవంలో ఈశాన్య భారత సంస్కృతిని ప్రజలకు పరిచయం చేశామని, ఈసారి పశ్చిమ భారత వైభవాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉందన్నారు. ఈ మహోత్సవం ద్వారా ప్రజలు ఆ ప్రాంతాల జానపద కళలు, హస్తకళలు, సంగీతం, వంటకాల కోసం తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ తరహా కార్యక్రమాలు దేశంలోని విభిన్న ప్రాంతాల ప్రజల మధ్య పరస్పర అవగాహన పెంచుతాయని రాష్ట్రపతి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉంటూ ఇతర రాష్ట్రాల సంస్కృతిని తెలుసుకునే అరుదైన అవకాశం ఈ భారతీయ కళా మహోత్సవం ద్వారా లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజస్థాన్ గవర్నర్ హరిభాఊ బగ్డే, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు, రాష్ట్ర మంత్రి సీతక్క, గుజరాత్ మంత్రి నరేష్ మగన్‌భాయ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. కాగా, భారతీయ కళా మహోత్సవానికి శనివారం నుంచి ప్రజలను అనుమతిస్తామని, ఈ నెల 30వరకు ఉత్సవాలు జరుగుతాయని రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మహోత్సవానికి ప్రజలను అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.