President Draupadi Murmu: 17 నుంచి రాష్ట్రపతి శీతాకాల విడిది
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:21 AM
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17వ తేదీ నుంచి 21 వరకు 5 రోజులపాటు రాష్ట్రంలో ఉండనున్నారు....
21 వరకు రాష్ట్రంలో ఉండనున్న ద్రౌపది ముర్ము
విడిది ఏర్పాట్లపై సీఎస్ రామకృష్ణారావు సమీక్ష
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశం
హైదరాబాద్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17వ తేదీ నుంచి 21 వరకు 5 రోజులపాటు రాష్ట్రంలో ఉండనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. విడిది ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి విడిది కోసం అన్ని శాఖల అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, రాష్ట్రపతి నిలయం అధికారులతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని సూచించారు. పోలీసు విభాగం తగిన భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని.. ఆరోగ్య శాఖ తమ వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రోడ్లు-భవనాల శాఖ అవసరమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని, జీహెచ్‌ఎంసీ అధికారులు రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్తు శాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రపతి నిలయంలో 24 గంటల పాటు పాములు పట్టే (స్నేక్ క్యాచర్) బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతులు, తేనెటీగల బెడద లేకుండా చూడాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికా్‌సరాజ్, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సి.వి.ఆనంద్, డీజీపీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు.