kumaram bheem asifabad- కొత్త సొబగులతో ప్రీ ప్రైమరీ
ABN , Publish Date - Jun 22 , 2025 | 11:11 PM
ప్రైవేట్ పాఠశాలల మాదిరిగానే ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనూ పూర్వ ప్రాథమిక (ప్రీప్రైమరీ) విద్య అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో 19 పాఠశాలల్లో దీనికి సంబంధించిన తరగతులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది
- బొమ్మలు చూపుతూ బోధన
- జిల్లాలో 19 పాఠశాలలు గుర్తింపు
- ప్రవేశాలు పెంచడమే లక్ష్యం
ప్రైవేట్ పాఠశాలల మాదిరిగానే ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనూ పూర్వ ప్రాథమిక (ప్రీప్రైమరీ) విద్య అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో 19 పాఠశాలల్లో దీనికి సంబంధించిన తరగతులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
బెజ్జూరు, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పాఠశాలలకు వచ్చే విద్యార్థులను ఆకట్టుకునేలా ఆయా పాఠశాలలను ఆకర్షణీయంగా మార్చారు. ప్రభుత్వం ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా ముస్తాబు చేసింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 19 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీగా గుర్తించి ఆయా పాఠశాలల్లో చిన్నారులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు గాను కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్యను పెంచడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
- ఆటాపాటలతో..
జిల్లాలోని ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చిన్నారులను ఆకట్టుకునేలా వివిధ రకాల సామాగ్రిని అందజేసి ఆటాపాటలతో విద్యా బోధన అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో చిన్నారులకు ఆట వస్తువులు, బొమ్మలను అందజేసింది. పాఠశాలలను, గదులను వివిద రకాల రంగులు, ఆకృత్యాలతో అందంగా ఏర్పాటు చేశారు. పాఠశాల గదుల గోడలపై అందమైన రంగులు వేసి చిన్నారులను ఆకట్టుకునేలా మార్చారు. లోపల గదుల్లో చిన్నారులకు అర్థమయ్యేలా పాఠ్యాంశాలకు సంబంధించిన బొమ్మలు, వివిద రకాలతో కూడిన ఆకృత్యాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం పాఠశాలల్లో ఇన్‌స్రక్టర్లను నియమించింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ఏర్పాటు చేసి ప్రాథమిక స్థాయికి వచ్చే వరకు విద్యార్థులను సన్నద్ధ చేసేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావించింది.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 19పాఠశాలలను ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా గుర్తించారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ.500అందజేయనుంది. ఇందులో రూ.100నోట్ పుస్తకాలకు, రూ.250తో స్టేషనరి, రూ.150తో చార్టు పేపర్ల కోసం వినియోగించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పాఠశాలలకు వివిధ రకాల బొమ్మలు, ఆట వస్తువులు అందజేసింది. చిన్నారులను ఆకట్టుకునేలా విద్యా బోధన నిర్వహించేందుకు ఒక్కో పాఠశాలకు ఒక ఇన్‌స్ట్రక్టర్లను కూడా నియమించింది. ఆయా పాఠశాలలను రంగులతో పాటు గది లోపల స్వాతంత్య్ర సమర యోదుల చిత్రాలను ఏర్పాటు చేశారు. చిత్రాలను చూపిస్తూ చిన్నారులకు అర్థమయ్యే విధంగా పాఠాలు బోధిస్తున్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను ప్రీ ప్రైమరిగా గుర్తించడంతో ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో పాటు ఇక్కడ పని చేస్తున్న నలుగురు ఉపాధ్యాయులు తలా రూ.10వేలు స్వంతంగా ఖర్చు చేసి మరింత ఆకర్షనీయంగా మార్చారు.
ఉపాధ్యాయుల కృషితో...
- జ్యోతి, హెచ్‌ఎం, ప్రాథమిక పాఠశాల, బెజ్జూరు
ఉపాధ్యాయుల సమిష్టి కృషితో ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన బోధన అందిస్తున్నాం. తమ పాఠశాలను ప్రీ ప్రైమరీగా గుర్తించడం ఆనందంగా ఉంది. తాము పని చేస్తున్న పాఠశాలకు తమ వంతు కృషిగా ఏదైనా చేయాలనే తపనతో తాము అభివృద్ది కోసం ఉపాధ్యాయులంతా కలిసి రూ.40వేల వరకు ఖర్చు చేసి ఆకర్షణీయంగా మార్చుకున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నాం.