Share News

Bathukamma Festival: బతుకమ్మ సంబురాలకు ఏర్పాట్లు చేయండి

ABN , Publish Date - Sep 25 , 2025 | 04:36 AM

ఈ నెల 29న సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించే భారీ బతుకమ్మ కార్యక్రమంతోపాటు 26న ముఖ్యమంత్రి పాల్గొనే బతుకమ్మకుంట బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయడానికి తగిన ఏర్పాట్లు ...

Bathukamma Festival: బతుకమ్మ సంబురాలకు ఏర్పాట్లు చేయండి

  • 26న బతుకమ్మకుంట సంబురాల్లో పాల్గొననున్న సీఎం.. 29న సరూర్‌నగర్‌ స్టేడియంలో 10 వేల మంది మహిళలతో ఉత్సవం

  • గిన్ని్‌సబుక్‌ రికార్డుల్లోకి ఎక్కే అవకాశం: సీఎస్‌

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 29న సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించే భారీ బతుకమ్మ కార్యక్రమంతోపాటు 26న ముఖ్యమంత్రి పాల్గొనే బతుకమ్మకుంట బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం ఆయన సచివాలయం నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అంబర్‌పేట్‌లో ప్రభు త్వం పునరుద్ధరించిన బతుకమ్మకుంటలో 26న నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటారని సీఎస్‌ తెలిపారు. దీనికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. బతుకమ్మకుంట ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వానాలను ప్రజాప్రతినిధులు, వీఐపీలకు సకాలంలో పంపాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించే బతుకమ్మ కార్యక్రమానికి 10వేలకుపైగా మహిళలు హాజరవుతారని, ఇది గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉందన్నారు. 27న ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ కార్నివాల్‌, 29న పీపుల్స్‌ ప్లాజా, 30న ట్యాంక్‌బండ్‌పై పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశామని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పేర్కొన్నారు.

కార్నివాల్‌కు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు

ఈ నెల 27న ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ కార్నివాల్‌ నిర్వహించేందుకు హెచ్‌ఎండీఏ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ట్యాంక్‌బండ్‌పై ఆ రోజున సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పూర్తిగా రాకపోకలు నిలిపివేయనున్నారు. అలాగే ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి. బతుకమ్మ కార్నివాల్‌లో నగరంలోని అన్ని ప్రాంతాల మహిళలు పెద్దఎత్తున పాల్గొనేందుకు, బతుకమ్మ ఆడేందుకు వీలుగా చర్య లు చేపడుతున్నారు. సందర్శకులకు ఆహ్లాదకరమైన అనుభూతి కలిగించే కార్యక్రమాలు ఉండనున్నాయి. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Sep 25 , 2025 | 04:36 AM