Share News

Vaikunta Ekadashi Celebration: వైకుంఠ ఏకాదశికి గుట్ట ముస్తాబు

ABN , Publish Date - Dec 29 , 2025 | 01:41 AM

ఏకాదశి వేడుకలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, పాతగుట్ట ఆలయం ముస్తాబవుతోంది.

Vaikunta Ekadashi Celebration: వైకుంఠ ఏకాదశికి గుట్ట ముస్తాబు

  • వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు

యాదగిరిగుట్ట, భద్రాచలం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి వేడుకలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, పాతగుట్ట ఆలయం ముస్తాబవుతోంది. ఈ నెల 30వ తేదీన ఉదయం 5.30గంటలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో ఎస్‌.వెంకట్రావు తెలిపారు. యాదగిరిగుట్ట దేవస్థాన ప్రధాన కార్యాలయంలో ఆయన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీవరకు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిస్తుండగా, 30వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. 2రోజుల పాటు(ఈ నెల 30, 31న) ఉభయ క్యూలైన్లలో వచ్చే భక్తులను ఉత్తర ద్వారంలో అనుమతించనున్నారు. మరోవైపు ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది.

నేడు భద్రాద్రి రామయ్యకు తెప్పోత్సవం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ సీతారామచంద్రస్వామి గోదావరి నదిలో జలవిహారం చేయనున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభం కాగా తొలి 10రోజుల పాటు పగల్‌పత్తు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ముక్కోటికి తరలివచ్చే భక్తులకు స్వామి వారి మూలవరుల దర్శనం, ఉత్తరద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.


తిరుమలలో నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠద్వార దర్శనాలు

తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి నుంచి వైకుంఠద్వార దర్శనాలు మొదలుకానున్నాయి. పది రోజుల పాటు దాదాపు 7.70లక్షల మందికి దర్శనం చేయించేలా టీటీడీ ప్రణాళికలు రూపొందించుకుంది. సోమవారం అర్ధరాత్రి 12.05 గంటలకు తిరుప్పావై పాశురాలతో ఆలయంలోని బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు. ధనుర్మాస ప్రత్యేక కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు, అలంకారం పూర్తిచేసి 1.30 గంటలకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను ప్రారంభిస్తారు. ఉదయం 5.30కు ఆన్‌లైన్‌లో టోకెన్‌పొందిన భక్తులను అనుమతిస్తారు తొలి మూడురోజులు కేవలం డిప్‌ ద్వారా టోకెన్ల పొందినవారికే దర్శనం ఉంటుంది. మిగిలిన ఏడు రోజుల్లో సర్వదర్శనం, రూ.300దర్శనం, శ్రీవాణి, ప్రొటోకాల్‌ వీఐపీ దర్శనాలు జరగనున్నాయి.

కిటకిటలాడిన మేడారం

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం భక్తజనంతో కిటకిటలాడింది. మరో నెలరోజుల్లో మహాజాతర జరగనున్న నేపథ్యంలో మందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. ఆదివారం సుమారు లక్ష మంది వనదేవతలను దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. భక్తులు కల్యాణ కట్టల్లో తలనీలాలు సమర్పించారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం సమ్మక్క-సారలమ్మలను జపిస్తూ శివసత్తుల పూనకాల మధ్య ఎత్తుబంగారం(బెల్లం) నెత్తిన పెట్టుకొని దేవస్థానానికి చేరుకున్నారు. దేవతల గద్దెల వద్ద పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, చీరె సారె, కొబ్బరికాయలు యాట మొక్కులను చెల్లించుకున్నారు.

- తాడ్వాయి

Updated Date - Dec 29 , 2025 | 01:41 AM