Pregnant Woman: సర్కారు వైద్యానికి భయపడిన గర్భిణి
ABN , Publish Date - Sep 12 , 2025 | 04:42 AM
ప్రభుత్వ ఆస్పత్రిలో పురుడు పోసుకునేందుకు భయపడిన గర్భిణికి సర్కారు వైద్య సిబ్బంది ధైర్యం కల్పించారు...
ధైర్యం చెప్పిన వైద్య సిబ్బంది
రిమ్స్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ
ఆదిలాబాద్, సెప్టెంబరు11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రిలో పురుడు పోసుకునేందుకు భయపడిన గర్భిణికి సర్కారు వైద్య సిబ్బంది ధైర్యం కల్పించారు. ప్రభుత్వ సేవలు సురక్షితమని, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని నమ్మకం కల్పించడంతో చివరకు సర్కారు దవాఖానలో వైద్యానికి అంగీకరించింది. ఆస్పత్రికి తరలించిన గంటలోపే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆదిలాబాద్ దహిగూడ గ్రామానికి చెందిన ఆత్రం భీంబాయి అనే మహిళను ప్రసవం కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించేందుకు అంకోలి పీహెచ్‌సీ సిబ్బంది గ్రామానికి వెళ్లారు. తన కోసం వైద్య సిబ్బంది వస్తున్నారన్న భయంతో సమీపంలో ఉన్న పత్తిచేనులో మహిళ దాక్కుంది. గంట సేపు వెతకగా పత్తి చేనులో తన కుమారుడితో పాటు ఉన్న మహిళను వైద్య సిబ్బంది గుర్తించారు. కౌన్సెలింగ్ తర్వాత ఆస్పత్రికి వచ్చేందుకు ఆమె ఒప్పుకొంది. ఆమెను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, సాధారణ ప్రసవం అయింది. ప్రస్తుతం తల్లి, బిడ్డల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.