Share News

Domestic Violence: నిండు గర్భిణి దారుణ హత్య

ABN , Publish Date - Oct 19 , 2025 | 03:55 AM

తమ ఇంటి వ్యక్తిని కులాంతర వివాహం చేసుకున్న యువతిపై కక్ష పెంచుకున్న కుటుంబం.. దాడికి పాల్పడింది. నిండు గర్భిణి అనే కనికరం కూడా చూపకుండా గొడ్డలితో ..

Domestic Violence: నిండు గర్భిణి దారుణ హత్య

  • గొడ్డలితో నరికి చంపిన భర్త కుటుంబ సభ్యులు

  • కులాంతర వివాహం చేసుకున్నారనే కక్షతో..

దహెగాం అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): తమ ఇంటి వ్యక్తిని కులాంతర వివాహం చేసుకున్న యువతిపై కక్ష పెంచుకున్న కుటుంబం.. దాడికి పాల్పడింది. నిండు గర్భిణి అనే కనికరం కూడా చూపకుండా గొడ్డలితో నరికి చంపింది. ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గెర్రెకు చెందిన శివార్ల సత్తయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు కుమార్‌కు గతంలోనే వివాహమైంది. చిన్న కొడుకు శేఖర్‌ వారి ఇంటి ఎదురుగా ఉండే శ్రావణి (21)ని గత ఏడాది కులాంతర వివాహం చేసుకున్నాడు. శేఖర్‌ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా, శ్రావణిది ఎస్టీ సామాజిక వర్గం. ఈ పెళ్లిని శేఖర్‌ తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయి. ప్రేమ వివాహం చేసుకున్నప్పటి నుంచి శేఖర్‌ అత్తగారి ఇంట్లోనే ఉంటున్నాడు. అప్పటి నుంచి ఆ కుటుంబంపై సత్తయ్య కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం శేఖర్‌తోపాటు శ్రావణి తల్లిదండ్రులు వంట చెరుకు కోసం సమీప అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఇంట్లో శ్రావణి మాత్రమే ఉండడాన్ని గమనించిన సత్తయ్య, అతడి పెద్దకుమారుడు కుమార్‌, పెద్ద కోడలు కవిత.. శ్రావణిపై దాడికి పాల్పడ్డారు. 9 నెలల గర్భిణి అయిన శ్రావణిపై కత్తి, గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. శ్రావణి కేకలు విని ఇరుగుపొరుగు వారు కుటుంబ సభ్యులతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. శ్రావణి తండ్రి తలండి చెన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 19 , 2025 | 03:55 AM