Share News

Pre Primary Education: ఇక సర్కారీ బడుల్లోనూ పూర్వ ప్రాథమిక విద్య

ABN , Publish Date - Aug 19 , 2025 | 04:23 AM

రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల సంక్షేమంపై దృష్టి సారించింది. రెండున్నరేళ్లు దాటిన చిన్నారులకు ప్రభుత్వ పాఠశాలల్లో శిశు విద్య...

Pre Primary Education: ఇక సర్కారీ బడుల్లోనూ పూర్వ ప్రాథమిక విద్య

  • జీరో ఎన్‌రోల్‌మెంట్‌ పాఠశాలలను వినియోగించుకోవాలని ప్రభుత్వ ఆదేశం

  • అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త రూపం

హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల సంక్షేమంపై దృష్టి సారించింది. రెండున్నరేళ్లు దాటిన చిన్నారులకు ప్రభుత్వ పాఠశాలల్లో శిశు విద్య(ప్రీప్రైమరీ)ను ప్రారంభించడానికి కార్యచరణ సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే అంగన్‌వాడీ కేంద్రాలను ఎంచుకున్న పాఠశాలల్లోకి మార్చనున్నారు. పిల్లలు రెగ్యులర్‌ పాఠశాలల్లో చేరేనాటికి వారిని సంసిద్ధులను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం విద్యార్థులు లేని (జీరో ఎన్‌రోల్‌మెంట్‌) ప్రభుత్వ పాఠశాలల భవనాలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించడానికి రాష్ట్రంలో 21 జిల్లాల్లో 62 జీరో ఎన్‌రోల్‌మెంట్‌ ప్రభుత్వ పాఠశాలలను మహిళా శిశు సంక్షేమ శాఖ పరిశీలించింది. వాటిలో 17 జిల్లాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు సమీపంలో ఉన్న 34 పాఠశాలలను గుర్తించింది. ఈ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలను తక్షణమే పరిశీలించాలని సంబంధిత అధికారులకు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సృజన మార్గదర్శకాలు జారీ చేశారు. అన్నీ అనువుగా ఉంటే సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి పూర్వ ప్రాథమిక విద్యాబోధనను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మార్పులో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్తలను ఇకపై అంగన్‌వాడీ ఉపాధ్యాయులుగా పిలుస్తారు.

Updated Date - Aug 19 , 2025 | 04:23 AM