Share News

Prabhakar Rao: సుప్రీం ఆదేశాలతో సిట్‌ ముందు ప్రభాకర్‌ రావులొంగుబాటు

ABN , Publish Date - Dec 13 , 2025 | 05:49 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ప్రశ్నించనున్నట్లు సమాచారం...

Prabhakar Rao: సుప్రీం ఆదేశాలతో సిట్‌ ముందు ప్రభాకర్‌ రావులొంగుబాటు

  • ట్యాపింగ్‌ కేసులో.. కవిత భర్తను ప్రశ్నించనున్న సిట్‌?

హైదరాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ప్రశ్నించనున్నట్లు సమాచారం. ట్యాపింగ్‌ కేసులో ఇప్పటికే వందలాది మంది బాధితుల్ని సిట్‌ బృందం ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ట్యాప్‌ అయిన ఫోన్‌ నంబర్ల జాబితాలో అనిల్‌ నంబర్‌ కూడా ఉన్నట్లు సమాచారం. ఇంటి అల్లుడు అని చూడకుండా తన భర్త ఫోన్‌ను ట్యాప్‌ చేశారని కవిత సైతం ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే.. సిట్‌ ఆయనను సైతం ప్రశ్నించి వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు అధికారుల ఎదుట లొంగిపోవాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు శుక్రవారం ఉదయం 10.45 నిమిషాలకు సిట్‌ అధికారి, జూబ్లీహిల్స్‌ ఏసీపీ వెంకటగిరి ఎదుట లొంగిపోయారు. కోర్టు విధించిన నిబంధనలకు అనుగుణంగాదర్యాప్తు అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి.. దర్యాప్తు అధికారులు గతంలో ఆయన్ను విచారించిన సంగతి తెలిసిందే. కానీ, దర్యాప్తులో అత్యంత కీలకమైన ప్రభార్‌ రావు ఐ ఫోన్‌ క్లౌడ్‌ పాస్‌వర్డ్‌ మార్చడం, ఫోన్‌ ఫార్మాట్‌ చేసి ఇవ్వడంతో అధికారులకు తగిన ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు దర్యాప్తు అధికారులు ఆ అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. గత ప్రభుత్వంలో ఎవరి ఆదేశాల మేరకు రివ్యూ కమిటీ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఫోన్లు ట్యాప్‌ చేశారు? ఎస్‌ఐబీ కార్యాలయంలో హార్డ్‌ డిస్క్‌లు ఎందుకు ధ్వంసం చేసి కొత్త హార్డ్‌ డిస్క్‌లు ఏర్పాటు చేశారు? అని వారు ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే.. ఎస్‌ఐబీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఎస్‌వోటీ ఏర్పాటు చేయడానికి గల కారణాలు, ఎస్‌వోటీ సేకరించిన డేటా ధ్వంసం, ఎస్‌ఐబీ వద్ద మూడు దశాబ్దాలుగా ఉన్న అత్యంత కీలకమైన సమాచారం ధ్వంసం చేయడానికి గత ప్రధాన కారణాల గురించి కూడా సిట్‌ అధికారి వెంకటగిరి నేతృత్వంలో అధికారుల బృందం ప్రశ్నించింది. కానీ వారు అడిగిన ప్రశ్నలు వేటికీ ఆయన్నుంచి సరైన సమాధానం రానట్టు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఇదివరకు సిట్‌ ఎదుట హాజరైన సమయంలోనే తన వద్ద ఉన్న మొత్తం సమాచారం అందించానని.. కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదని ప్రభాకర్‌ రావు తెలిపినట్లు సమాచారం.

ప్రభాకర్‌ రావును వచ్చే శుక్రవారం వరకూ.. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సిట్‌ కార్యాలయంలోనే ఉంచి విచారించనున్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశారు. శుక్రవారం ప్రభాకర్‌ రావుకు ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని దర్యాప్తు అధికారులు అందించారు. రాత్రి టిఫిన్‌ ఇచ్చారు. ఆయన ఔషధాలను అందుబాటులో ఉంచారు.

Updated Date - Dec 13 , 2025 | 05:49 AM