Share News

పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ప్రారంభం

ABN , Publish Date - Jun 25 , 2025 | 11:54 PM

తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్టు ఎడమ వైపున ఉన్న తెలంగాణ విద్యుత్‌ కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభమైంది.

పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ప్రారంభం
బీ.వెల్లెంల రిజర్వాయర్‌లోకి చేరుతున్న నీరు

చింతలపాలెం, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్టు ఎడమ వైపున ఉన్న తెలంగాణ విద్యుత్‌ కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు(175 అడుగులు) కాగా, బుధవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు 24.0030 టీఎంసీలుగా(48.35 అడుగులు) నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సాగునీటి అవసరాల నిమిత్తం పులిచింతల పవర్‌ హౌస్‌ ఒక యూనిట్‌ నుంచి రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ విద్యుదుత్పత్తి ప్రారంభించారు. పులిచింతల విద్యుత్‌ కేంద్రంలో పూర్తిసామర్థ్యం 120మెగావాట్ల విద్యు దుత్పత్తి కాగా, ఒక యూనిట్‌ నుంచి 15 మెగావాట్ల విద్యుదుద్పత్తి ప్రారంభించామని ఎస్‌ఈ దేశ్యానాయక్‌ తెలిపారు.

బీ.వెల్లెంల రిజర్వాయర్‌లోకి నీటి విడుదల

నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని బీ.వెల్లెంల ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి బుధవారం సాయంత్రం నుంచి ప్రాజెక్టు అఽధికారులు నీటి విడుదల ప్రా రంభించారు. ప్రాజెక్టు సీఈ ఆదేశాల మేరకు డీఈఈ విఠలేశ్వర్‌ ఒక మోటారును ఆన్‌చేసి నీటిని విడుదలచేశారు. గత వేసవికాలంలో చు ట్టుపక్కల గ్రామాల్లో నెలకొన్న తీవ్రమైన తాగునీటి ఎద్దడి నివారణ కోసం ప్రధాన కాల్వల ద్వారా చెర్వుల్లోకి నీటిని విడుదల చేశారు. దీంతో రిజర్వాయర్‌లో నీటి నిల్వలు డెడ్‌ స్టోరేజీకి చేరాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 0.302టీఎంసీలు కాగా ఎగువ పానగల్‌ ఉదయసముద్రం రిజర్వాయర్‌లో నీటి లభ్యత ఆధారంగా బీ.వెల్లెంల రిజర్వాయర్‌ నింపనున్నారు. 24గంటల పాటు ఒక మోటారు మాత్రమే నడపనున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

డెడ్‌ స్టోరేజీకి చేరిన డిండి రిజర్వాయర్‌

డిండి: వర్షాధార మధ్యతరహా ప్రాజెక్టు డిండి రిజర్వాయర్‌ డెడ్‌ స్టోరేజీకి చేరింది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 36 అడుగులుకాగా(2.4 టీఎంసీలు) ప్రస్తుత నీటిమట్టం 11అడుగులు(0.25 టీఎంసీ)గా కనిష్ట స్థాయికి చేరింది. రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాల్వల పరిధిలోని 12,500 ఎకరాలు గత వానాకాలం, యాసంగి సీజన్‌లో సాగులోకి వచ్చింది. యాసంగి సీజన్‌కు 2024 డిసెంబరు 11న నీటిని విడుదల చేశారు. మునుపెన్నడూ విధంగా వానాకాలం, యాసంగి రెండు సీజన్‌లకు వ్యవసాయ భూములకు సాగునీరు అందడంతో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ప్రాజెక్టుపై ఆధారపడిన 400 మంది మత్స్యకారులు జీవనోపాధి పొందారు.

Updated Date - Jun 25 , 2025 | 11:54 PM