Share News

పన్ను కట్టకపోతే పవర్‌ కట్‌

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:13 AM

నల్లగొండ మునిసిపాలిటీలో పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు మునిసిపల్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

 పన్ను కట్టకపోతే పవర్‌ కట్‌

పన్ను కట్టకపోతే పవర్‌ కట్‌

ఆస్తి పన్ను వసూళ్లకు నూతన కార్యాచరణ

బకాయిదారులకు కరెంట్‌ కనెక్షన కట్‌...!

గృహాల ముందు డప్పు చప్పుళ్లతో వినూత్న నిరసన

కార్యాచరణ రూపొందించిన అధికారులు

నూరు శాతం వసూలు చేసేందుకు చర్యలు

రామగిరి, నల్లగొండ 21(ఆంధ్రజ్యోతి): నల్లగొండ మునిసిపాలిటీలో పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు మునిసిపల్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల చివరిలోగా నూరుశాతం వసూళ్లే లక్ష్యంగా అధికారులు వివిధ రకాల ప్రణాళికలు రూపొందించారు. కమర్షియల్‌ బకాయిదారులకు విద్యుత అధికారుల సహకారంతో ఆయా విద్యుత కనెక్షన్లను కట్‌ చేయడంతో పాటు మంచినీటి సరఫరా నిలిపివేయాలని, రెసిడెన్షియల్‌ గృహాల బకాయిదారుల ఇళ్ల ముందు డప్పు చప్పుళ్లతో నిరసన తెలిపి ఆస్తి పన్ను వసూలు చేసేందుకు సరికొత్త ఆలోచనతో ప్రణాళికలు రూ పొందించారు. విద్యుత అధికారుల బృందం, 10 మంది డప్పు చప్పుళ్లదారులతో కలిసి ఇంటింటికి తిరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నల్లగొండ పట్టణంలో 1200 మంది బకాయిదారులకు రెడ్‌ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు కొంతమంది స్పందించగా మరి కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దీంతో ఆయా బకాయిదారుల నుంచి వసూ ళ్లే లక్ష్యంగా మునిసిపల్‌ అధికారులు వివిధ ప్రణాళికలు రూపొందించారు.

బకాయిలు రూ.37కోట్ల పైచిలుకు...

నీలగిరిలో 48 వార్డులకు గాను 36,150 నివాసగృహాలు, 3,481 కమర్షియల్‌ గృహాలు ఉన్నాయి. ఈ రెండు కలుపుకొని 2,447 గృహాలు ఉండగా మొత్తం గా 42,078 గృహాలు ఉన్నాయి. అయితే వీటి నుంచి ప్రతి ఏడాది రూ.16.62 కోట్ల ఆదాయం ఆస్తిపన్ను రూపేణా రావాల్సి ఉంది. ఇకపోతే వీటిపై పాత బకాయిలు రూ. 14.91 కోట్ల పైచిలుకు ఉంది. వీటిపై జరిమానాను కలుపుకొని రూ.48.41 కోట్ల బకాయి ఉంది. అయితే నేటి వరకు సుమారు రూ. 12 కోట్ల వరకు వసూళ్లు కాగా రూ.37 కోట్ల పైచిలు కు అద్దె రూపేనా రావాల్సిఉంది.

వసూళ్లే లక్ష్యంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు

మార్చి చివరినాటికి ఆస్తి పన్ను వందశాతం వసూలు చేయాలన్న లక్ష్యంతో మునిసిపల్‌ అధికారు లు ప్రత్యేకంగా 16 బృందాలను ఏర్పాటు చేశారు. వీరితో పాటు మునిసిపల్‌ కమిషనర్‌, రెవెన్యూ అధికారికూడా ఆస్తి పన్ను వసూళ్ల కోసం తిరగనున్నారు.

ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.13 కోట్ల పైమాటే...

నల్లగొండ పట్టణంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 96 కార్యాలయాలు ఉం డగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి 300 కార్యాలయాలు ఉన్నాయి. వీటి నుంచి ప్రతి ఏడాది రూ.88.5 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. కానీ రూ.4 కోట్ల పైచిలుకు మాత్ర మే వసూలయ్యాయి. ఇక సుమారు రూ.13కోట్ల పై చిలుకు ఆస్తి పన్ను రూపేనా మునిసిపాలిటీకి రావాల్సి ఉంది. మొత్తంగా వివిధ గృహాలు ప్రభుత్వ కార్యాలయాలు కలుపుకుంటే రూ.50 కోట్ల పైచిలుకు రావాల్సింది. అయితే అధికారులు మాత్రం కమర్షియ ల్‌, రెసిడిన్షియల్‌ గృహాలు వంటి వాటిపై మాత్రమే దృష్టి సారించారు.

ఇప్పటికే 1200 మందికి రెడ్‌ నోటీసులు

పట్టణంలో రూ.50వేలకు పైబడి ఉన్న 1200 మంది బకాయిదారులకు ఇటీవల కాలంలోనే మునిసిపల్‌ అధికారులు రెడ్‌ నోటీసులు జారీ చేశారు. నిబంఽధనల ప్రకారం రెడ్‌ నోటీసులు అందుకున్న వారు వారం రోజుల్లో స్పందించాల్సి ఉంటుంది. ఇందులో కొంతమంది బకాయిలు చెల్లించగా మరికొంతమంది నిర్లక్ష్యం వీడటం లేదు. దీంతో మునిసిపల్‌ అధికారులు ఆయా గృహాల ముందు డప్పు చప్పుళ్లతో నిరసన తెలపడంతో పాటు, వాహనాలు, ఆస్తులను జప్తు చేసేందుకు అధికారులు తగు ప్రణాళికలు రూపొందించారు. ప్రధానంగా కమర్షియల్‌ గృహ యజమానులే బకాయిలు పెద్ద ఎత్తున ఉండటంతో వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇకపోతే ఇప్పటికే కొన్ని కమర్షియల్‌ గృహాలను జప్తు చేశారు.

ఆస్తి పన్ను చెల్లించాలి

ఆస్తిపన్ను చెల్లించాలని బకాయిదారులందరికీ ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చాం. అయి నా కొంతమంది మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. అలాంటి వారి ఆస్తి పన్ను చెల్లించని బకాయిదారులకు జిల్లా ఉన్నతాధికారుల అనుమతి తో విద్యుత కనెక్షన కట్‌ చేయడంతో పాటు గృహాల ముందు డప్పు చప్పుళ్లతో నిరసన తెలియజేసి అయినా సరే ఆస్తి పన్ను వసూలు చేస్తాం. అవసరమైతే వాహనాలతో పాటు ఆస్తులను జప్తు చేస్తాం.

- శివరాంరెడ్డి, మునిసిపల్‌ రెవెన్యూ అధికారి

Updated Date - Mar 23 , 2025 | 12:13 AM