Share News

kumaram bheem asifabad- ఇంటి నుంచే నమోదుకు అవకాశం

ABN , Publish Date - Sep 18 , 2025 | 11:17 PM

నిరుద్యోగులు ఎంప్లాయిమెంట్‌ కార్డు ఇంటి నుంచే పొందే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. ఇటీవల నిరుద్యోగులు నిరుద్యోగ యువకులు ఉపాధి కార్యాలయాల్లో తమ పేరును నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన లేకపోవడంతో వెనకడుగేస్తున్నారు.

kumaram bheem asifabad- ఇంటి నుంచే నమోదుకు అవకాశం
ఎంప్లాయిమెంట్‌ కార్డు

వాంకిడి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులు ఎంప్లాయిమెంట్‌ కార్డు ఇంటి నుంచే పొందే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. ఇటీవల నిరుద్యోగులు నిరుద్యోగ యువకులు ఉపాధి కార్యాలయాల్లో తమ పేరును నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన లేకపోవడంతో వెనకడుగేస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిరుద్యోగులు ఉపాధి కార్యాలయానికి వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో తమ పేరును రిజిస్ట్రేషన్‌ చేసుకేందుకు వీలుగా అవకాశం కల్పించారు. దీంతో ఇంటి వద్ద ఉంటూనే నిరుద్యోగులు ఎంప్లాయిమెంట్‌ కార్డు పొందవచ్చు. రెన్యువల్‌ గడువును మార్చు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ లో నమోదు, ప్రభత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉపాధి అవకాశాలపై ఉపాధి కార్యాలయ అధికా రులు అవగాహన కూడా కల్పిస్తున్నారు. ఒకసారి అభ్యర్థి నమోదు చేసుకుంటే 54 ఏళ్ల వర కు గడువు ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 61 నిండినప్పుడు కార్డుకు కాలం చెల్లుతుంది.

- ఉద్యోగాల్లో ప్రాధాన్యం కోసం..

గతంలో ఉద్యోగాల్లో ప్రాధాన్యం కోసం తమ విద్యార్హతలతో ఎంప్లాయిమెంట్‌ కార్యా లయాలకు పరుగులు తీసి, చంతాడంత క్యూలైన్లలో నిలబడి దరఖాస్తులు చేసుకునే పరిస్థితి ఉండేది. పదో తరగతి పూర్తయితే చాలు వెంటనే ఎంప్లాయిమెంటు రిజిస్ట్రేషన్‌ చేయించుకునేవారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ స్వరూపంతో పాటు పేరుకు కూడా మార్చుకుంది. చేతిలో మొబైల్‌ ఉంటే.. నిరుద్యోగులు ఇంటి నుంచే కొలువులకు దరఖా స్తులతో పాటు కొలువుల వివరాలు తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ విధానంతో నిరుద్యోగులకు వ్యయప్రయాసలు తగ్గిపోయాయి. కాగా గతంలో ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కచ్చితంగా ఉపాధి కార్యాలయంలో నమోదు తప్పని సరి ఉండేది. జిల్లా స్థాయి పోస్టులను అభ్యర్థుల విద్యార్హత, ఎంప్లాయిమెంట్‌ సీనియారిటీ ప్రాతిపదికన ఎంపిక ఉండేది. 1994 తర్వాత కొంత ప్రాధాన్యం తగ్గడంతో ఎంప్లాయిమెంట్‌ కార్డు తీసుకునేందుకు అభ్యర్థులు వెనకాడుతున్నారు.

- నమోదు ఇలా..

నిరక్షరాస్యులు, ఉన్నత విద్యావంతులు కార్డు పొందవచ్చు. డబ్ల్యూ..డబ్ల్యూ..డబ్ల్యూ. ఎంప్లాయ్‌మెంట్‌. తెలంగాణ. గౌట్‌. ఇన్‌ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వస్తుంది. అన్ని వివరాలు నమోదు చేయాలి. అభ్యర్థులు కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎంప్లాయ్‌మెంట్‌ కార్డు పొందుతారు. కొత్తగా నమోదు చేసుకునే వారు ఫొటో, నివాస, విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు కాగితంపై సంతకం సిద్ధం చేసుకోవల్సి ఉంటుంది.

Updated Date - Sep 18 , 2025 | 11:17 PM