BC Reservations: బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు!
ABN , Publish Date - Oct 07 , 2025 | 03:18 AM
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు...
సుప్రీంకోర్టు తీర్పు శుభ పరిణామం.. హైకోర్టులోనూ సానుకూల తీర్పే వస్తుందని ఆశిస్తున్నాం
రిజర్వేషన్ల అమలుకు పనిచేస్తాం
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
న్యాయ ప్రక్రియలోనూ బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు సహకరించాలి
జూబ్లీహిల్స్ టికెట్ బీసీకే: పొన్నం
42ుపై అన్ని వర్గాలూ సహకరించాలి
ప్రభుత్వ, పార్టీ పరంగానూ పోరాడి సాధిస్తాం: మహేశ్‌గౌడ్
న్యూఢిల్లీ/హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర జరుగుతోందని, ఎవరెన్ని కుట్రలు చేసినా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ఆయన.. హైకోర్టులోనూ సానుకూలమైన తీర్పే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ నేపథ్యంలో ఆదివారం రాత్రే మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో కలిసి భట్టి విక్రమార్క ఢిల్లీకి చేరుకున్నారు. న్యాయవాదులు, సంబంధిత అధికారులతో చర్చించారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టుకు వెళ్లారు. పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు తీర్పు వచ్చిన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9పై కొంతమంది సుప్రీంకోర్టులో వేసిన కేసు వీగిపోయిందన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వమే కాదని, దేశం మొత్తం గమనిస్తోందని చెప్పారు. రిజర్వేషన్లను అడ్డుకునేందుకు, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు సహకరించాలి
బీసీలకు 42 శాతం రిజర్వేన్ల బిల్లుకు అసెంబ్లీలో మద్దతిచ్చినట్లుగానే న్యాయప్రక్రియలోనూ బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం, రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఆమోదం పొందేలా చూడాలని బీజేపీ బీసీ ఎంపీలు ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌లను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్ల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. ప్రచారం కోసమే ఢిల్లీకి వచ్చామని రాంచందర్‌రావు అనడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. బీజేపీ అన్ని రకాల రిజర్వేషన్లకు వ్యతిరేమని ధ్వజమెత్తారు. సెంట్రల్ యూనివర్సిటీలో దళిత యువకుడి మృతికి రాంచందర్‌రావు కారకుడని ఆరోపించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిని రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం వంద శాతం బీసీకే దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జీవో 9కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడం శుభ పరిణామమని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఈ నెల 8న హైకోర్టులోనూ ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా పోరాటం చేస్తామని, రిజర్వేషన్ సాధిస్తామని తెలిపారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌లు బీసీ రిజర్వేషన్ల అమలు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. బీసీలకు 42ు రిజర్వేషన్ల అమలు కోసం అన్ని వర్గాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, బీసీల రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా వివిధ కోర్టుల్లో దాఖలైన పిటిషన్లను ఉపసంహరించుకోవాలని ఎంపీ మల్లు రవి పిటిషనర్లకు విజ్ఞప్తి చేశారు. బీసీల రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా కోర్టుల్లో దాఖలైన పిటిషన్ల వెనక కేటీఆర్ హస్తం ఉందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ఆరోపించారు. బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన విషయంలో అన్ని రాజకీయ పార్టీలూ సహకరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కోరారు.
బీసీలకు 42ు రిజర్వేషన్లు వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9 న్యాయస్థానాల్లో చెల్లదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అన్నారు. సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్లమని మాత్రమే చెప్పిందని గుర్తుచేశారు.