kumaram bheem asifabad- పార్టీ జెండా మోసిన వారికే పదవులు
ABN , Publish Date - Jul 12 , 2025 | 10:26 PM
కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికే పదవులు వస్తాయని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికే పదవులు వస్తాయని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరికీ జిల్లా కమిటీలో అవకాశం వస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. ఈ రిజర్వేషన్లను బీసీ నాయకులు వినియోగించుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో డి లిమిటేషన్ ప్రక్రియ ద్వారా నియోజక వర్గాల సంఖ్య కూడా రాష్ట్రంలో 151కి పెరుగుతుందన్నారు. దీనిలో బీసీలతో పాటు మహిళలకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయన్నారు. గతంలో అధికారులంలో లేనప్పుడు నాయకుల, కార్యకర్తల పరిస్థితి ఎలా ఉండే అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలోకి నాయకులు రావడం సహజమని గుర్తు చేశారు. పార్టీ బాగుంటేనే నాయకులు బాగుంటా రని ఆ దిశగా పని చేయాలన్నారు. అధికారంలో లేనప్పుడు సమస్యలపై పోరాటం చేశామని, వాటిని పరిష్కరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలువాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అంతకు ముందు టీపీసీసీ జనరల్ సెక్రెటరీ రమేశ్‌బాబు మాట్లాడుతూ అన్ని మతాలు, కులాలు వర్గాలకు సమన్యాయం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. కుటుంబాల్లో తగాదలు రావడం ఎలాగో పార్టీలో కూడా అలాగేనని వాటిని సర్దుకుంటూ పోవాలని నాయకులకు సూచించారు. ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ జిల్లాకు ప్రనాధారమైన ప్రాణహిత నదిపై కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి అడుగులు పడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పక్కన పెట్టిన గత ప్రభుత్వం కాళేశ్వరం కట్టి దాన్ని కూలేశ్వరంగా మార్చిందని అన్నారు. డ్రోన్లతో ప్రాజెక్టును చూపి ప్రజలను మభ్య పెట్టిందని, డబుల్ బెడ్ రూం పేరుతో రంగుల స్వప్నం చూపించిందని ఆరోపించారు. తన పుట్టిన ఊరే బెజ్జూరు అని అత్తగారి ఊరు దహెగాం అని చెబుతూ అభివృద్ధిని మరిచారని ప్రస్తుత ఎమ్మెల్యేను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో నిర్లక్ష్యం చేసిన దిందా వాగుపై బ్రిడ్జి మంజూరు అయిందని, వర్షాకాలం పూర్తయిన రువాత నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ 75 సంవత్సరాలు బీసీ రిజర్వేషన్ కల నెరవేర్చిన గొప్ప పార్టీ కాంగ్రెస్ అని కితాబిచ్చారు. నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్ మాట్లాడుతూ కొంత మంది కుట్రలు చేసి తన ఓటమికి కారణమయ్యారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వర్గీయులకు టికేట్లు కేటాయించాలని వారిని గెలపించుకుంటానని తెలిపారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నందున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ తిరుపతి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, నాయకులు రమేశ్, నరేష్‌జాదవ్, గణపతి, విశ్వనాథ్, సదయ్య, శ్యాం, సుగుణక్క, బాలేష్‌గౌడ్, అనీల్‌గౌడ్, మల్లన్న, మునీర్, రామయ్య, వసంతరావు, చరణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్ ఫొటో లేక పోవడంతో ఆయన వర్గానికి చెందిన నాయకులు మండిపడ్డారు. జిల్లా ఇన్‌చార్జి రమేశ్‌బాబు ఎదుట నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేయగా ఆయన వారిని వారించే ప్రయత్నం చేశారు. పెద్ద కార్యక్రమాలు చేసే సందర్భంలో చిన్న చిన్న పొరపాట్లు జరగడం సర్వసాధారమని భవిష్యత్‌లో ఇలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఫ్లెక్సీలో ఫొటో పెట్టక పోవడం తమను అవమానించడమేనని నినాదాలు చేయడంతో వారిని ఉద్దేశించి డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు మాట్లాడే సమయంలో సమాధానం చెబుతానని చెప్పడంతో కార్యకర్తలు శాంతించారు.