Minister Ponguleti Srinivas Reddy: కాళేశ్వరం అవినీతి సొమ్ముతో... జూబ్లీ హిల్స్‌లో గెలిచేందుకు బీఆర్‌ఎస్ యత్నం
ABN , Publish Date - Nov 04 , 2025 | 03:11 AM
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సొమ్ముతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు....
బోరబండ, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సొమ్ముతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌తో కలిసి రహ్మత్‌నగర్ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడి సంపాదించిన రూ.లక్ష కోట్లను బీఆర్‌ఎస్ ఇప్పుడు రాజకీయాల్లో ఉపయోగిస్తోందని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు చేస్తున్న పన్నాగాలు ఎట్టి పరిస్థితుల్లో సఫలం కావని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి బీఆర్‌ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఈ మూడేళ్లే కాకుండా మరో ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఏమి చేసిందో ఓటర్లు గమనించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఇంతవరకు గ్రామీణ ప్రజలపై దృష్టి సారించామని, ఇకపై పట్టణ పేదలకు ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఎస్పీఆర్ హిల్స్‌లో మంత్రి పొంగులేటి సమక్షం లో 200మంది యువకులు, కార్మిక నగర్‌లో ఆటో యూనియన్ అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో 200 మం ది ఆటో డ్రైవర్లు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలో చేరారు.