Share News

Harish Rao: ఆస్పత్రులపై రాజకీయాలు దారుణం

ABN , Publish Date - Oct 05 , 2025 | 05:17 AM

కరోనా తర్వాత కేసీఆర్‌ వందేళ్ల ముందుచూపుతో హైదరాబాద్‌ నాలుగువైపులా నాలుగు టిమ్స్‌ ఆస్పత్రులను నిర్మించాలని తలపెడితే..

Harish Rao: ఆస్పత్రులపై రాజకీయాలు దారుణం

  • పురోగతి లేని ‘టిమ్స్‌’ భవనాల నిర్మాణం.. 1400 కోట్ల బకాయిలతో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం

  • సిబ్బందికి జీతాల్లేక బస్తీ దవాఖానాల మూత

  • కేసీఆర్‌ది ముందుచూపు.. కాంగ్రె్‌సది మందబుద్ధి

  • సీఎం రేవంత్‌ రెడ్డిపై హరీశ్‌రావు విమర్శలు

హైదరాబాద్‌/దిల్‌సుఖ్‌నగర్‌, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): కరోనా తర్వాత కేసీఆర్‌ వందేళ్ల ముందుచూపుతో హైదరాబాద్‌ నాలుగువైపులా నాలుగు టిమ్స్‌ ఆస్పత్రులను నిర్మించాలని తలపెడితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్‌ మీద ఉన్న కక్షతో ప్రజల ప్రాణాలను కాపాడే ఆస్పత్రులపై పగ పెంచుకోవడం దారుణమని మండిపడ్డారు. శనివారం హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో కలిసి కొత్తపేట టిమ్స్‌ ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. ఎల్బీనగర్‌ టిమ్స్‌లో సెల్లార్‌తో కలిపి 6 అంతస్తుల భవనాన్ని బీఆర్‌ఎస్‌ హయాంలో పూర్తిచేస్తే.. రెండేళ్లుగా కాంగ్రెస్‌ ప్రభు త్వం కేవలం 5 అంతస్తులను మాత్రమే పూర్తిచేసిందని హరీశ్‌ తెలిపారు. వరంగల్‌ హెల్త్‌ సిటీ పనులు కూడా ముందుకు సాగడంలేదన్నారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే దురుద్దేశంతోనే ఆస్పత్రి నిర్మాణ పనులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులు ముందుచూపు లేని మందబుద్ధులని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మంజూరు చేసిన మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌ మెడికల్‌ కాలేజీలను రద్దు చేయడం దుర్మార్గన్నారు. కేసీఆర్‌ హయాంలో 450 బస్తీ దవాఖానాలను ప్రారంభించారని, ఆరు నెలలు గా వాటి వైద్యులకు, సిబ్బందికి జీతాలు చెల్లించకుండా రేవంత్‌ రెడ్డి వాటిని మూతపడేలా చేస్తున్నారన్నారు. రూ.1,400కోట్ల బకాయిలు పెట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు పేరొస్తుందనే అక్కసుతో కంటి వెలుగు పథకాన్ని నిలిపివేశారని, రాజకీయాలు పక్కనపెట్టి ఈ పథకాన్ని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వివేకానంద గౌడ్‌, కాలేరు వెంకటేష్‌, ఎమ్మెల్సీ యాదిరెడ్డి, చింత ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2025 | 05:17 AM