kumaram bheem asifabad- పల్లెల్లో వేడెక్కుతున్న రాజకీయం
ABN , Publish Date - Sep 04 , 2025 | 11:06 PM
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మంత్రివర్గ సమావే శంలో కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీంతో ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని తేలిపోయింది. అధికారులు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తాజాగా గ్రామ పంచా యతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ముసా యిదాను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరిం చారు.
- ఆశావహుల యత్నాలు షురూ
- మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలంటూ ప్రచారం
- పోరుకు అధిక యంత్రాంగం ఏర్పాట్లు
- జిల్లాలో 15 జడ్పీటీసీ, 127 ఎంపీటీసీ, 15 ఎంపీపీ స్థానాలు
చింతలమానేపల్లి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మంత్రివర్గ సమావే శంలో కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీంతో ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని తేలిపోయింది. అధికారులు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తాజాగా గ్రామ పంచా యతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ముసా యిదాను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరిం చారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికా రులు సమావేశాలు నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఎన్నికలే ముందు నిర్వహిస్తారనే ప్రచారం జోరందుకుంది. ఇటీవల కోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబరు 30 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో ఈసీ సైతం ఆ దిశగా దృష్టి సారించింది.
- ఏడాదికి పైగా ప్రత్యేక పాలనే..
గ్రామ పంచాయతీ ఎన్నికలు 2019లో జరుగగా గత ఏడాది ఫిబ్రవరి 2వ తేదిన పాలక వర్గాల గడువు ముగిసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అదే ఏడాది మే నెలలో నిర్వహిస్తే 2024 జూన్ మాసంతో పాలక వర్గాల గడువు తీరింది. అప్పటి నుండి గ్రామ పంచాయతీల్లో, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. కానీ ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. కానీ ప్రత్యేకాధికారులు కొన్ని ప్రాంతాల్లో పట్టించుకోకపోవ డంతో పాలన కుంటుపడుతోంది. నిధులు సైతం అం తంత మాత్రంగానే వస్తుండడంతో అభివృద్ది పనులు ముందుకు సాగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయంటూ హడావుడి చేయడం, ఆపై మరుగున పడడం సాధారణమైంది. ఐదారు నెలలుగా నేడో, రేపో నోటిఫికేషన్ వస్తుందని ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు ఆయా నియోజక వ ర్గాలలోని మండలాల వారీగా సమావేశాలు, పర్యటన లు సైతం పూర్తి చేస్తున్నారు. అయితే కుల గణన, బీసీలకు 42శాతం రిజర్వేషన్లౖస ప్రభుత్వ నిర్ణయంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది తేలకపోవడంతో ఆశావహులు కూడా స్తబ్దంగా ఉండిపోయారు.
- కోర్టు తీర్పుతో..
ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎన్నికల వాతావరణం ఒక్క సారిగా వేడెక్కింది. సెప్టెంబరు 30 కల్లా స్థానిక సంస్థల్లో పాలక వర్గాలు కొలువుదీరాలని తీర్పు వెలువడింది. జిల్లాలోని 335 పంచాయతీలు, వార్డులు అంతే స్థాయిలో పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 127 ఎంపిటీసీ, 15 జడ్పీటీసీ. 15 ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వ హించడానికి కసరత్తులు జరుగుతున్నాయి. ఇందుకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పోలింగ్ రెండు విడతల్లో నిర్వహించడానికి నిర్ణయించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఎంపిక చేయా లని కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు.
ఎన్నికల కమిషన్ వైపు చూపు..
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మంత్రి మండలి లేఖ ఆధారంగా ఎన్నికల కమిషన్ ఏ ఎన్నికకు, ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇప్పటి వరకు ఉన్న రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని సైతం ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పంచాయ తీరాజ్ చట్టం సవరించి ప్రత్యేక జీవో జారీ అయిన ట్లయితే జిల్లాలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు మారను న్నాయి. దీంతో జడ్పీటీసీ, ఎంపీటీసీలు మొదలుకొని సర్పంచ్, వార్డు సభ్యుల వరకు ఎలాంటి రిజర్వేషన్ వస్తుందనే దానిపై రాజకీయ పార్టీలతో పాటు ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
- గడువు ముగిసి ఏడాదిన్నర..
పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. జడ్పీ, మండల పరిషత్ పాలక వర్గాల గడువ ముగిసి ఏడాది దాటింది. పల్లెల్లో రానున్న ఎన్నికలపై రాజకీయ పార్టీతో పాటు ఆశావహులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు వారి నిరీక్షణకు తెరదించేలా ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకు రావడంతో ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటి వరకు పట్టించుకోని పలువురు ఓటర్లను సైతం అప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. యువతకు విందులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమను గెలిపిస్తే గ్రామానికి అవసరమైన పనులన్నీ చేసి పెడుతామని నమ్మకం కల్గించేలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది.
జిల్లాలోని స్థానిక సంస్థల వివరాలు..
జడ్పీటీసీ స్థానాలు 15
ఎంపీటీసీ స్థానాలు 127
ఎంపీపీలు 15
గ్రామ పంచాయతీలు 335
వార్డులు 2,874
మొత్తం ఓటర్లు 3,53,895
పురుషులు 1,76,606
మహిళలు 1,77,269
ఇతరులు 20