Share News

Mahesh Goud criticized: సీఎంను కలిస్తే పార్టీ ఫిరాయించినట్లా?

ABN , Publish Date - Sep 14 , 2025 | 05:40 AM

ముఖ్యమంత్రిని అందరూ కలుస్తారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కలిశారు. కలిస్తే పార్టీ ఫిరాయించినట్టేనా అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ప్రశ్నించారు.....

Mahesh Goud criticized: సీఎంను కలిస్తే పార్టీ ఫిరాయించినట్లా?

  • హరీశ్‌రావు, కేటీఆర్‌.. ప్రధాని మోదీని కలవలేదా?.. స్థాయిని మించి రాహుల్‌గాంధీపై కేటీఆర్‌ విమర్శలు

  • ఆయన వ్యాఖ్యల వెనుక బీజేపీ నేతలు: మహేశ్‌గౌడ్‌

  • ఫిరాయింపులపై బీఆర్‌ఎస్‌ మాట్లాడటమా?: మధుసూదన్‌రెడ్డి

  • రేవంత్‌రెడ్డి దమ్మున్నోడు కాబట్టే మిమ్మల్ని ఓడించాడు: అద్దంకి

  • కేటీఆర్‌ ఏ మొహం పెట్టుకుని గద్వాలకు వస్తారు?: సంపత్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు13 (ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రిని అందరూ కలుస్తారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కలిశారు. కలిస్తే పార్టీ ఫిరాయించినట్టేనా?’’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ప్రశ్నించారు. హరీశ్‌రావు, కేటీఆర్‌ కూడా ప్రధాని మోదీని కలిశారని, దీంతో వాళ్లు బీజేపీలో చేరినట్టేనా? అని అన్నారు. కేటీఆర్‌ తన స్థాయిని మించి రాహుల్‌గాంధీపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోదీ మోక్షం కోసమే రాహుల్‌గాంధీని విమర్శిస్తున్నారని ఆరోపించారు. శనివారం గాంధీభవ న్‌లో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. కేటీఆర్‌, హరీశ్‌రావు కలిసి బీఆర్‌ఎ్‌సను బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నించారంటూ కవిత చెప్పారని గుర్తు చేశారు. మానసికంగా బీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీలో విలీనమైందన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు గురించి రాహుల్‌గాంధీ ఎందుకు స్పందిస్తారని పీసీసీ చీఫ్‌ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం స్పీకర్‌ పరిధిలోని విషయమన్నది గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్‌ పదేళ్లు పాలించి.. వందేళ్లకు సరిపడా దోచుకున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ నుంచి తప్పించుకునేందుకు బీజేపీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారని అన్నారు. కేటీఆర్‌ వ్యాఖ్యల వెనక బీజేపీ నేతలున్నారని చెప్పారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో సుదర్శన్‌రెడ్డికి మద్దతు తెలపకపోవడం ద్వారానే బీఆర్‌ఎస్‌ వైఖరి బట్టబయలైందని, ఆ పార్టీ పరోక్షంగా ఎన్డీఏకు మద్దతు తెలిపినట్టు స్పష్టమైందని పేర్కొన్నారు. 48 గంటల్లో కాళేశ్వరం అవినీతిని తేలుస్తామన్న కిషన్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు సైలెంట్‌ అయ్యారని ప్రశ్నించారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనంలో భాగంగానే కాళేశ్వరంపై విచారణ ఆగిందని భావిస్తున్నామని చెప్పారు. కోట నీలిమకు ఈసీ నోటీసులివ్వడం రాజకీయ కక్షసాధింపు చర్య అని మహేశ్‌గౌడ్‌ ఆరోపించారు. 2017లో కోట నీలిమ కుటుంబం చిరునామా మార్చాలని ఎన్నికల కమిషన్‌కు ఫామ్‌-6 ఇచ్చినా ఈసీ చర్యలు తీసుకోలేదని తెలిపారు. తమ విధులు సక్రమంగా నిర్వహించని ఈసీ.. ఇప్పుడు బీజేపీ ఒత్తిడితో నోటీసులిచ్చిందని మండిపడ్డారు. దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు.


ఇంటిపోరు భరించలేక కేటీఆర్‌ జిల్లాల బాట

కేటీఆర్‌ను చూస్తే జాలి కలుగుతోందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఇంట్లో ఓవైపు చెల్లెలి పోరు, బావ నసుగుడు, మరోవైపు తండ్రి సతాయింపు తట్టుకోలేక కేటీఆర్‌ జిల్లాల దారి పడుతున్నట్టుందని ఎద్దేవా చేశారు. పదేళ్లపాటు రాజ్యాంగాన్ని,ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష పార్టీలను పట్టపగలు ఖూనీ చేసిన బీఆర్‌ఎస్‌.. ఫిరాయింపులపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాగా, కేటీఆర్‌ మాట్లాడే సుద్దపూస మాటలను తెలంగాణ ప్రజలు పట్టించుకోరని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు. రేవంత్‌రెడ్డి మొగోడైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలంటున్న కేటీఆర్‌.. గతంలో బీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో మగతనం లేకనే రాజీనామా చేయించలేదా? అని ప్రశ్నించారు. ‘‘రేవంత్‌రెడ్డి దమ్మున్నోడు కాబట్టే తొడకొట్టి మిమ్మల్ని ఓడించి ఫామ్‌హౌ్‌సకు పంపించారు’’ అని తెలిపారు. కాగా, పదేళ్లపాటు చేనేత మంత్రిగా పని చేసిన కేటీఆర్‌ గద్వాలలో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేయకుండా చేనేత కార్మికులను మోసం చేశారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అన్నారు. తిరిగి ఏ ముఖం పెట్టుకుని అక్కడికి వెళతారని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్నప్పుడు ఫిరాయింపుల విషయం గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ రాజకీయాలను వ్యభిచారంగా మార్చారని మండిపడ్డారు.

Updated Date - Sep 14 , 2025 | 05:40 AM