మందు బాబులపై పోలీసుల కన్ను
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:41 AM
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకో కుండా ఉండేందుకు జిల్లా పోలీస్ యంత్రాం గం అప్రమత్తమైంది. రెండు రోజుల నుంచే తనిఖీలను ముమ్మరంగా చేపట్టిన పోలీసులు ఈ నెల 31 రోజు రాత్రి మొదలు తెల్లవారుజా ము వరకు నిరంతర పర్యవేక్షణ చేయనున్నా రు
మద్యం మత్తులో వాహనం నడిపితే కేసు, జైలు
జిల్లా అంతటా ఎన్‌ఫోర్స్‌మెంట్ స్పెషల్ డ్రైవ్‌లు
రెండు రోజుల నుంచే ముమ్మరంగా.. నేడు మరింత
నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకునేలా చర్యలు
నల్లగొండ క్రైం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యో తి): నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకో కుండా ఉండేందుకు జిల్లా పోలీస్ యంత్రాం గం అప్రమత్తమైంది. రెండు రోజుల నుంచే తనిఖీలను ముమ్మరంగా చేపట్టిన పోలీసులు ఈ నెల 31 రోజు రాత్రి మొదలు తెల్లవారుజా ము వరకు నిరంతర పర్యవేక్షణ చేయనున్నా రు. ప్రధానంగా యువత మద్యం మత్తులో ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఇతర వా హనాలు నడిపి ప్రమాదాల బారిన పడకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలను వేగంగా నడిపే యువకులకు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదేశాల మేరకు కౌ న్సిలింగ్ ఇవ్వడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అదుపులోకి తీసుకుంటా రు. వ్యవహారం శృతి మించితే కేసు నమోదుచేసేందుకు పోలీసులు నిర్ణయించారు. నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో కొందరు యువకులు మద్యంతో పాటు గంజాయి, డ్రగ్స్ తీసుకొని అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశం ఉండటంతో దీన్ని అడ్డుకునేందుకు పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం పార్టీలు, డీజేలు నిషేధం..
జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుక ల సందర్భంగా ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో..
మద్యంతో పార్టీలు చేసుకోవడాన్ని, డీజేల వినియోగంపైనా పోలీసులు నిషేధం విధించారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతూ తప్పటడగులు వేస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఒక్క నల్లగొండ పట్టణంలోనే 15 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా నల్లగొండ పానగల్ ఫ్లైఓవర్, నార్కట్‌పల్లి-అద్దంకి బైపాస్ రోడ్, హైదరాబాద్ రోడ్, దేవరకొండ రోడ్, మిర్యాలగూడ రోడ్‌తోపాటు పలు ప్రాంతాలల్లో పోలీసులు నిఘా పెట్టి తనిఖీలు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా కూడా గుర్తించి అదుపులోకి తీసుకునేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. 31న జిల్లా వ్యాప్తంగా పెద్ద మొత్తంలో తనిఖీలు నిర్వహించేలా పోలీసులు ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 29 అర్ధరాత్రి నల్లగొండలో డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో వన్‌టౌన్, టూటౌన్, రూరల్ సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది ముమ్మరంగా తనిఖీ చేయడంతో 16మంది మందుబాబులు పట్టుబడ్డారు. అందులో ఒకరికి జైలుశిక్ష పడగా, మరో 15మందికి ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున కోర్టు జరిమానా విధించింది. నూతన సంవత్సరం వేడుకలను కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలే తప్ప రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్ చేయవద్దని, దీన్ని అతిక్రమిస్తే కేసులు నమోదుచేసి చట్టపర చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కొంతమంది యువకులు ద్విచక్రవాహనాల సైలెన్సర్లు మార్చడం, లేదా తొలగించి రోడ్లపై తిరుగుతున్న విషయాన్ని పోలీసులు గమనించిన వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదుచేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30 నుంచే 31వ తేదీ, జనవరి 1వ తేదీ తెల్లవారుజాము వరకు తనిఖీలు, నిఘా మరింత పెంచనున్నారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆపరేషన్ చబూత్రా
జిల్లాలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ఆపరేషన్ చబూత్రా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఈ నెల 30న మద్యం మత్తులో వాహనాలు నడిపిన 30మందిపై కేసులు నమోదు చేశారు. పత్రాలు లేని 150 వాహనాలను సీజ్‌చేసి కేసులు నమోదు చేశారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఆపరేషన్ చబూత్రాను కఠినంగా అమలు చేయాలని ఎస్పీ ఆదేశించడంతో పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. రద్దీ, సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రహదారులపై హంగామ చేయవద్దని, బహిరంగ ప్రదేశాల్లో పార్టీలు, మద్యం సేవించడం, డీజే కార్యక్రమానికి అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనం పట్టుబడితే సీజ్ చేసి రూ.10వేల జరిమానా, ఆరునెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ స్పెషల్ డ్రైవ్‌లు..
నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకునేలా పోలీ్‌సశాఖ పలు సూచనలు జారీ చేసింది. మద్యం తాగి న వ్యక్తులు ఇంటికే పరిమితమై, వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, వాహనాలతో రోడ్లపైకి వచ్చి డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశా రు. జీరో డ్రగ్స్ పాలసీ కింద ఇప్పటికే నల్లగొండతో పాటు పలు ముఖ్య పట్టణాల్లో నార్కోటి క్స్ జాగిలాలతో జల్లెడ పడుతున్నారు. సమస్యాత్మక, రద్దీ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్లుగా డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్ సరఫరాదారులతో పాటు వినియోగదారుల జాబితాను సిద్ధం చేశారు. ఆకతాయిలు ప్రజలకు ఆటంకాలు కలిగించే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని పోలీసు అధికారులు స్పష్టంగా ఆదేశాలు జారీచేశారు.