Share News

బ్యాంకు స్కామ్‌ను ఛేదించిన పోలీసులు

ABN , Publish Date - Aug 31 , 2025 | 11:47 PM

చెన్నూరు ఎస్‌బీఐ బ్యాంకు-2లో జరిగిన గోల్డ్‌లోన్‌, నగదు స్కామ్‌ను పోలీసులు చేధించారు. వారం రోజులుగా సంచలనం రేపిన ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన బ్యాంకు క్యాషియర్‌ నరిగె రవీందర్‌, మరో 45 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆదివారం రామగుండం పోలీస్‌ కమీషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా వివరాలను వెల్లడించారు.

బ్యాంకు స్కామ్‌ను ఛేదించిన పోలీసులు
స్వాధీనం చేసుకున్న బంగారాన్ని పరిశీలిస్తున్న రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

-15కిలోల 237 గ్రాముల బంగారం స్వాధీనం

-రూ.1,61,730 నగదు స్వాధీనం

-44 మంది నిందితుల అరెస్టు..పరారీలో మరో ఇద్దరు

-వివరాలు వెల్లడించిన రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

చెన్నూరు, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : చెన్నూరు ఎస్‌బీఐ బ్యాంకు-2లో జరిగిన గోల్డ్‌లోన్‌, నగదు స్కామ్‌ను పోలీసులు చేధించారు. వారం రోజులుగా సంచలనం రేపిన ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన బ్యాంకు క్యాషియర్‌ నరిగె రవీందర్‌, మరో 45 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆదివారం రామగుండం పోలీస్‌ కమీషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా వివరాలను వెల్లడించారు. బ్యాంకులో అవకతవకలు జరిగినట్లు 402 మందికి సంబంధించిన గోల్డ్‌లోన్‌ అకౌంట్‌లలోని బంగారం 25కిలోల17గ్రాములు, రూ. 1.10 కోట్లు దుర్వినియోగం అయినట్లు ఎస్‌బీఐ రీజనల్‌ మేనేజర్‌ రితీష్‌కుమార్‌ గుప్తా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో సీపీ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ పర్యవేక్షణలో దర్యాప్తు బాధ్యతలను జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌కు అప్పగించారు. ప్రత్యేక బృందాలు బ్యాంకులో శోధనలు జరిపి క్యాషియర్‌ నరిగె రవీందర్‌ అకౌంట్‌పై ఆడిట్‌ నిర్వహించడంతో ఇందులో పెద్ద మొత్తంలో అవకతవకలు, అనుమానస్పదంగా భారీ మొత్తంలో జమలు ఉన్నట్లు గుర్తించారు. ప్రధాన సూత్రధారి నరిగె రవీందర్‌ను అరెస్టు చేసి విచారించగా ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లలో 2024 అక్టోబరుకు ముందు రూ. 40 లక్షలు కోల్పోయినట్లు ఒప్పుకున్నాడని, తన నష్టాన్ని తిరిగి పొందడానికి బెట్టింగ్‌లు కొనసాగించడానికి బ్యాంకు మేనేజర్‌ ఎన్నపు రెడ్డి మనోహర్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి అటెండర్‌ లక్కాకుల సందీప్‌లతో కలిసి బ్యాంకులో మోసం చేయాలని పథకం వేసినట్లు తెలిపారు. బ్యాంకు కరెన్సీ, చెస్ట్‌ తాళాలు మేనేజర్‌, క్యాషియర్‌ ఇద్దరి సంయుక్త ఆధీనంలో ఉండగా మేనేజర్‌ తన తాళాన్ని క్యాషియర్‌కు ఇచ్చాడని, దీన్ని ఉపయోగించుకుని రవీందర్‌ బంగారం, నగదును దొంగలించాడని పేర్కొన్నారు. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని బయటకు తీసి తన స్నేహితుడైన ఎస్‌బీఎఫ్‌సీ బ్యాంకు మంచిర్యాల సేల్స్‌మేనేజర్‌ కొంగొండి బీరయ్య , అదే బ్యాంకు కస్టమర్స్‌ రిలేషన్‌ మేనేజర్‌ కొడపి రాజశేఖర్‌, బ్యాంకు సేల్స్‌ ఆఫీసర్‌ బొల్ల కిషన్‌లకు ఇచ్చేవాడని, వారు ఆ బంగారాన్ని గోల్డ్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్‌లు తీసుకుని వచ్చిన డబ్బును ఖాతాల్లో జమ చేసుకుని కొంత కమీషన్‌ తీసుకుని మిగితా మొత్తాన్ని రవీందర్‌కు పంపేవారన్నారు. ఇలా పది ప్రైవేటు గోల్డ్‌ కంపెనీల్లో 44 మంది పేర్లతో 142 గోల్డ్‌లోన్‌లు తీసుకున్నారని పేర్కొన్నారు. అలాగే క్యాషియర్‌ రవీందర్‌ తన కుటుంబీకుల పేర్లతో పాటు సన్నిహితుల పేర్లతో 42 నకిలీ ఖాతాలు సృష్టించి బంగారం లేకుండానే గోల్డ్‌లోన్‌లు మంజూరు చేసి 4కిలోల 14 గ్రాముల బంగారం తాకట్టు పెట్టినట్లు చూపించి కోటి 58 లక్షల రూపాయలు కాజేశాడన్నారు. అలాగే ఏటీఎంలలో డబ్బులు నింపే సమయంలో రవీందర్‌ చేతివాటం ప్రదర్శించేవాడన్నారు.

-15కిలోల 237 గ్రాముల బంగారం స్వాధీనం

దర్యాప్తు బృందం చాకచక్యంగా విచారణ జరిపి 15కిలోల 237 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌బీఎఫ్‌సీ, ఇండేన్‌ మనీ, గోదావరి అర్భన్‌, ముత్తూట్‌ మనీ, ఐఐఎఫ్‌ఎల్‌ కంపెనీల నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నామని , ఇక మిగిలిన బంగారం ముత్తూట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, మణప్పురం మంచిర్యాల, మణప్పురం మార్కెట్‌ ఏరియా (మంచిర్యాల), ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌, ముత్తూట్‌ ఫిన్‌ (చెన్నూరు), ముత్తూట్‌ మిని (చెన్నూరు) నుంచి స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. ఇందులో కంపెనీ మేనేజర్ల పాత్రపై పరిశీలన జరుగుతుందని, ఇప్పటి వరకు 44 మంది నిందితులను అరెస్టు చేశామని, ఇద్దరు పరారీలో ఉన్నారని, ఇందులో ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు కాగా, మిగితా 43 మంది సహకరించిన వ్యక్తులు ఉన్నారని పేర్కొన్నారు.

-ప్రత్యేక బృందానికి ప్రశంసలు

ఈ కేసు బహిర్గతం కావడంతో పాటు కేసును చేధించిన ప్రత్యేక బృందం పోలీసు అధికారులను సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అభినందించారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌, చెన్నూరు సీఐ దేవేందర్‌రావు, చెన్నూరు రూరల్‌ సీఐ బన్సీలాల్‌, శ్రీరాంపూర్‌ సీఐ వేణుచందర్‌, మంచిర్యాల రూరల్‌ సీఐ అశోక్‌, డబ్య్లూటీఎస్‌ ఇన్స్‌పెక్టర్‌ నరేష్‌కుమార్‌, సీసీఎస్‌ ఇన్స్‌పెక్టర్‌ బాబురావు, ఎస్‌ఐలు సుబ్బారావు, శ్రీధర్‌, రాజేందర్‌, శ్వేత, సంతోష్‌, లక్ష్మీప్రసన్న, కోటేశ్వర్‌, ఉపేందర్‌రావు, చంద్రశేఖర్‌, రవిలతో పాటు హెడ్‌ కానిస్టేబుల్లు శంకర్‌, రవి, కానిస్టేబుళ్లు రమేష్‌, ప్రతాప్‌, తిరుపతి , లింగమూర్తిలను సీపీ అభినందించి ప్రశంసలు అందించారు. 46 మంది నిందితులపై వివిధ సెక్షన్‌ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

-నిందితులు వీరే..

ఏ1గా నరిగె రవీందర్‌ , క్యాషియర్‌, గ్రామం శెట్‌పల్లి,ఏ2గా ఎన్నపురెడ్డి మనోహర్‌, బ్రాంచ్‌ మేనేజర్‌, ముత్తరావుపల్లి గ్రామం

ఏ3గా లక్కాకుల సందీప్‌, అటెండర్‌, చెన్నూరు గ్రామం,ఏ4గా కొంగండి బీరయ్య, సేల్స్‌మేనేజర్‌ , ఎస్‌బీఎఫ్‌సీ బ్యాంకు, మంచిర్యాల,ఏ5గా కోదాటి రాజశేఖర్‌, కస్టమర్‌ రిలేషన్‌ మంచిర్యాల ఎస్‌బీఎఫ్‌సీ, మంచిర్యాల, ఏ6గా బొల్లి కిషన్‌కుమార్‌, సేల్స్‌ ఆఫీసర్‌ ఎస్‌బీఎఫ్‌సీ, మంచిర్యాల, ఏ7గా ఉమ్మాల సురేష్‌, ఫొటోగ్రాఫర్‌ , శెట్‌పల్లి గ్రామం,ఏ8గా నడిగొట్టు సాగర్‌, రాళ్లపేట, మంచిర్యాల,ఏ9గా రాంశెట్టి చంద్రబాబు, రామకృష్ణపూర్‌,ఏ10గా భరతపు రాకేష్‌, ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి, రామకృష్ణపూర్‌

ఏ11గా దిగుట్ల సునీల్‌, లక్ష్మీనగర్‌, మంచిర్యాల,ఏ12గా కడం రమేష్‌, రామకృష్ణపూర్‌,ఏ13గా దారపు నాగరాజు, ప్రైవేటు ఉద్యోగి, మంచిర్యాల,ఏ14గా నిట్టూరి రాజు, గ్రామం నారాయణపూర్‌, చెన్నూరు,ఏ15గా కంబాల మహేష్‌, ప్రైవేటు ఉద్యోగి, గ్రామం ఐనా, దహెగాం మండలం,ఏ16గా కంది మల్లేష్‌, గోదావరి అర్భన్‌ బ్యాంకు ఉద్యోగి, కాలేజీ రోడ్డు, మంచిర్యాల,ఏ17గా జూపాక సత్యనారాయణ, ఐఐఎఫ్‌ఎల్‌ ఉద్యోగి, మంచిర్యాల,ఏ18గా దయ్యాల మహేందర్‌, కుందారం గ్రామం,ఏ19గా ఉరుగొండ పరంధాములు, ఎస్‌బీఎఫ్‌సీ బ్యాంకు సెక్యూరిటీ గార్డు, మందమర్రి, ఏ20గా కుమ్మరి నగేష్‌, లక్ష్మీపూర్‌, సిరొంచ, మహారాష్ట్ర

ఏ21గా మహ్మద్‌ రషీద్‌, గోదావరి అర్భన్‌ బ్యాంకు ఉద్యోగి, మంచిర్యాల,ఏ22గా దాడి రాజ్‌కుమార్‌, ఐఐఎఫ్‌ఎల్‌ బ్యాంకు ఉద్యోగి రామకృష్ణపూర్‌, ఏ23గా కన్నం రాకేష్‌, ట్యూజన్‌ ఫైనాన్స్‌ ఉద్యోగి, మంచిర్యాల,ఏ24గా నేరెడిగొండ అనిల్‌, నర్సింగాపూర్‌,ఏ25గా దుర్కె ప్రవీణ్‌కుమార్‌, శెట్‌పల్లి గ్రామం,ఏ26గా బొడ్డుపల్లిప్రశాంత్‌, శ్రీరామ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఉద్యోగి, మంచిర్యాల,ఏ27గా మంతెన రాజశేఖర్‌, పౌనూరు గ్రామం,ఏ28గా కొమ్ము మహేష్‌, శెట్‌ల్లి గ్రామం,ఏ29గా పంచాల శశిధర్‌, రాళ్లపేట, మంచిర్యాల

ఏ30గా దుర్గం మనోహర్‌, బూరుగుపల్లి గ్రామం,ఏ31గా జాకావర్‌ మహేష్‌, మోబిన్‌పేట, సిరొండ, మహారాష్ట్ర,ఏ32గా మహ్మద్‌ హబీబ్‌ పాషా, రామకృష్ణపూర్‌, ఏ33గా జంగంపల్లి యుగేందర్‌, చున్నంబట్టివాడ, మంచిర్యాల,ఏ34గా మహ్మద్‌ సమీరొద్దీన్‌, ఇండేల్‌ మనీ ఫైనాన్స్‌ ఉద్యోగి, మంచిర్యాల,ఏ35గా మోత్కూరి శ్రీనివాస్‌ , మణప్పురం బ్యాంకు ఉద్యోగి మంచిర్యాల,ఏ36గా తాళ్లండి అంజయ్య, గ్రామం కొత్తూరు, నెన్నెల మండలం,ఏ37గా నిమ్మతి సుమ, చున్నంబట్టివాడ, మంచిర్యాల (పరారీలో ఉంది)

ఏ38గా పాని రవళి, రామకృష్ణపూర్‌,ఏ39గా ఈసంపల్లి సాయికిరణ్‌, శెట్‌పల్లి గ్రామం,ఏ40గా నరిగె స్వర్ణలత, శెట్‌పల్లి గ్రామం

ఏ41గా గౌడ సుమన్‌, ప్రైవేటు ఉద్యోగి, శెట్‌పల్లి,ఏ42గా సుండి సురేష్‌, కమాన్‌పూర్‌, పెద్దపల్లి,ఏ43గా జుర్రు శ్రీనివాస్‌, సీతారాంపల్లి, నస్పూర్‌,ఏ44గా తుంగపిండి శేఖర్‌ (పరారీలో ఉన్నాడు),ఏ45గా నరిగె సరిత, శెట్‌పల్లి గ్రామం,ఏ46గా మోత్కూరి రమ్యలను అరెస్టు చేసి ఆదివారం చెన్నూరు మున్సిఫ్‌ కోర్టు జడ్జి పర్వతపు రవి ముందు హాజరు పరిచారు.

-నిందితులకు వైద్య పరీక్షలు

బ్యాంకు స్కామ్‌ కేసులో పట్టుబడిన 44 మంది నిందితులకు పోలీసులు ఆదివారం చెన్నూరు సామాజిక ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం చెన్నూరు మున్సిఫ్‌ కోర్టు జడ్జి రవి ముందు వారిని ప్రవేశపెట్టారు. అనంతరం వీరిని రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Aug 31 , 2025 | 11:47 PM