KTR Remarks on DGP Deemed Uncivil: డీజీపీపై కేటీఆర్ వ్యాఖ్యలు అనాగరికం
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:38 AM
డీజీపీ శివధర్‌రెడ్డిని ఉద్దేశించి బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల, పోలీసు అధికారుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ...
పోలీసు సంఘాల తీవ్ర ఆగ్రహం
క్షమాపణ చెప్పాలని డిమాండ్
లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరిక
హైదరాబాద్, నవంబర్12(ఆంధ్రజ్యోతి): డీజీపీ శివధర్‌రెడ్డిని ఉద్దేశించి బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల, పోలీసు అధికారుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. డీజీపీని లక్ష్యంగా చేసుకుని తెలంగాణ పోలీసు వ్యవస్థపై ఆయన ఆధారరహిత వ్యాఖ్యలు చేశారని, తద్వారా మొత్తం రాష్ట్ర పోలీసు వ్యవస్ధను అవమానించినట్లుగా భావిస్తున్నామని ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి విక్రంసింగ్ మాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను కేటీఆర్ బేషరతుగా ఉపసంహరించుకోకపోతే... న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమన్నారు. నిర్మాణాత్మక విమర్శలకు ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతామని స్పష్టం చేశారు. పోలీసు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసినా లీగల్ యాక్షన్ తీసుకుంటామన్నారు. ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయ ప్రేరేపిత సంఘటనలను దృష్టిలో పెట్టుకుని డీజీపీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. అభ్యంతరకరంగా, అనాగరికంగా ఉన్నాయని మరో ప్రకటనలో పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని ఉపసంహరించుకుని, పత్రికాముఖంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కేటీఆర్ ప్రస్తావించిన అన్ని సంఘటనల్లో కేసులు నమోదు చేశామని సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి పేర్కొన్నారు. పోలీసుల పనితీరులో ఆక్షేపించాల్సినదేమీ లేదని, ఒకవేళ ప్రశ్నించాల్సి వచ్చినా సభ్యత పాటించాలన్నారు.