Share News

singer Chinmayi Sripada filed a complaint: ఇలాంటోళ్లకు పిల్లలు పుట్టకూడదు

ABN , Publish Date - Nov 07 , 2025 | 01:47 AM

తనను, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో పలువురు దారుణమైన కామెంట్లు పెడుతున్నారని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద..

singer Chinmayi Sripada filed a complaint: ఇలాంటోళ్లకు పిల్లలు పుట్టకూడదు

  • ఒకవేళ పుట్టినా వెంటనే చనిపోవాలి

  • చిన్మయి శ్రీపాద, రాహుల్‌ రవీంద్రన్‌ దంపతులపై సోషల్‌మీడియాలో తిట్లు

  • సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన చిన్మయి

  • ఫిర్యాదును సైబర్‌ క్రైమ్‌కి అప్పగించిన సీపీ

తనను, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో పలువురు దారుణమైన కామెంట్లు పెడుతున్నారని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద.. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌కు ‘ఎక్స్‌’ ద్వారా ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన కొన్ని స్ర్కీన్‌ షాట్లను ఫిర్యాదుతో జతచేశారు. ‘‘మహిళల గురించి వాళ్లు ఉపయోగిస్తున్న భాష దారుణంగా ఉంది. వారి వేధింపులతో విసిగిపోయాను. మా అభిప్రాయాలు నచ్చకపోతే వాటిని పట్టించుకోవద్దు. వదిలేయండి. కానీ మా పిల్లలు చనిపోవాలని వారు కోరుకోవడం దారుణం. అందుకే మీ దృష్టికి తీసుకొస్తున్నా’’ అని ఆమె పేర్కొన్నారు. దీనిపై సజ్జనార్‌ వెంటనే స్పందించారు. చిన్మయి ఫిర్యాదును సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అప్పగించారు.

ఇదీ నేపథ్యం..

రాహుల్‌ దర్శకత్వం వహించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఆ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో ఒకదాంట్లో ఆయన.. ‘నేను మహిళా పక్షపాతిని, వారికి స్వేచ్ఛను ఇవ్వాలనుకునే వాడిని, పెళ్లి తర్వాత మహిళలు తప్పనిసరిగా తాళి ధరించాలనే సంప్రదాయాన్ని నేను సమర్థించను’ ..అని వ్యాఖ్యానించారు. మంగళసూత్రం ధరించాలంటూ తన భార్య చిన్మయిని తానెప్పుడూ బలవంతం చేయలేదన్నారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా.. కొందరు ఆయన్ను సమర్థించారు. మరికొందరు విమర్శించారు. దీంతో చిన్మయి రాహుల్‌కు మద్దతుగా ‘ఎక్స్‌’లో ఒక పోస్టు పెట్టారు. ‘మంగళసూత్రం మహిళలపై లైంగిక వేధింపులను, లైంగిక దాడులను ఆపలేదు. పుట్టుక నుంచి మరణించే వరకు ఈ సమాజంలో మహిళలకు ఏ దశలోనూ భద్రత లేదు. చాలా చోట్ల మృతదేహాలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అప్పుడే పుట్టిన పసికందులపై దారుణాలు ఆగడం లేదు కదా?’ అని ఆ పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నెటిజన్లు రాహుల్‌-చిన్మయి దంపతులను తీవ్రంగా విమర్శించారు. ‘‘ఇలాంటి వారికి పిల్లలు పుట్టకూడదు...పుట్టినా వెంటనే చనిపోవాలి’’ అని కామెంట్స్‌ చేశారు. రాయడానికి వీలుకాని తీవ్రమైన అసభ్య పదజాలంతో చిన్మయిని దూషించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చిన్మయి సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. - సినిమా డెస్క్‌

Updated Date - Nov 07 , 2025 | 06:05 AM