N Arun Passes Away: కవయిత్రి ఎన్ అరుణ కన్నుమూత
ABN , Publish Date - Sep 27 , 2025 | 04:18 AM
కవయిత్రి, ఆచార్య ఎన్ గోపీ జీవిత సహచరి అరుణ(77) ఇకలేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం సాయంత్రం రామాంతపూర్‌లో..
ఆచార్య ఎన్ గోపి జీవిత భాగస్వామి అరుణ
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): కవయిత్రి, ఆచార్య ఎన్ గోపీ జీవిత సహచరి అరుణ(77) ఇకలేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం సాయంత్రం రామాంతపూర్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. అరుణ స్వస్థలం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగులో సహాధ్యాయులైన గోపీ, అరుణలది ప్రేమ వివాహం. వీరి కుమారుడు చైతన్య. వివాహానంతరం పూర్తిగా కుటుంబ బాధ్యతలకు అంకితమైన అరుణ ఐదు పదుల వయసు దాటిన తర్వాత కవిత్వం రాయడం ప్రారంభించారు. సినారె లాంటి ప్రసిద్ధ కవులు ఆమె కవిత్వాన్ని ప్రశంసించారు. ’మౌనమూ మాట్లాడుతుంది’, ’సూది నా జీవన సూత్రం’, పాటల చెట్టు, కవితా సంపుటాలుగా వెలువడ్డాయి. ఆమె సాహిత్య సృజనకు గాను ఉత్తమ కవయిత్రిగా పలు అవార్డులు వచ్చాయి. అరుణ అంత్యక్రియలు శనివారం ఉదయం 11 గంటలకు అంబర్ పేట శ్మశాన వాటికలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.