Share News

Poet Ande Sri Passes Away: ప్రజల గొంతుకగా అందెశ్రీ!

ABN , Publish Date - Nov 11 , 2025 | 02:53 AM

ప్రజల గొంతుకగా నిలిచిన అందెశ్రీ మరణం.. సాంస్కృతిక, మేధో ప్రపంచానికి తీరని లోటని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అందెశ్రీ మరణంపై ఎక్స్‌ వేదికగా ఆయన స్పందించారు....

Poet Ande Sri Passes Away: ప్రజల గొంతుకగా అందెశ్రీ!

  • ఆయన మరణం.. సాహితీ రంగానికి తీరని లోటు.. ‘ఎక్స్‌’ వేదికగా సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

  • రాష్ట్ర చరిత్రలో అందెశ్రీకి ప్రత్యేక స్థానం: కిషన్‌రెడ్డి

  • ఓ సాహితీ శిఖరం నేలకూలింది: సీఎం రేవంత్‌ రెడ్డి

  • మిత్రుడిని కోల్పోయా: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • ప్రజల్లో స్ఫూర్తి నింపిన అందెశ్రీ: ఉత్తమ్‌, పొన్నం, వాకిటి

  • ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన అందెశ్రీ: కేసీఆర్‌

  • (ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ప్రజల గొంతుకగా నిలిచిన అందెశ్రీ మరణం.. సాంస్కృతిక, మేధో ప్రపంచానికి తీరని లోటని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అందెశ్రీ మరణంపై ఎక్స్‌ వేదికగా ఆయన స్పందించారు. ‘‘అందెశ్రీ ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. గొప్ప కవి, మేధావి అయిన అందెశ్రీ ప్రజల పోరాటాలకు, ఆకాంక్షలకు, అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, ప్రజల సాంఘిక హృదయ స్పందనకు రూపం ఇచ్చే శక్తి ఉన్నాయి. సామాజిక స్పృహను, సాహితీ సౌందర్యంతో ఆయన మిళితం చేసిన విధానం అద్వితీయం. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’’ అని పేర్కొంటూ పోస్టు చేశారు. అందెశ్రీ మరణాన్ని తెలంగాణ సమాజం, కవులు, కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావుతో కలిసి ఆయన అందెశ్రీ భౌతికకాయాన్ని సందర్శించి.. నివాళులర్పించారు. తన రచనలతో తెలంగాణ సాహిత్య చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని రాసుకున్నారని వెల్లడించారు. అందెశ్రీ భౌతికంగా దూరమైనా ఆయన రాసిన పాటలరూపంలో సజీవంగా ఉంటారని తెలిపారు. తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన కవి అందెశ్రీ అని రాంచందర్‌రావు కొనియాడారు. అందెశ్రీ మరణం విచారకరమని త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనా రెడ్డి, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందని అభివర్ణించారు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతం.. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర సాధనలో ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తుచేశారు.


ప్రజాప్రభుత్వం అధికారికంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతాన్ని కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని పేర్కొన్నారు. జాతిని జాగృతం చేయడంలో అందెశ్రీ చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. అందెశ్రీ తనకు ఆప్త మిత్రుడని, ఆయన మరణం తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల్లో చైతన్యం రగిలించడంలో అందెశ్రీ కృషి చిరస్మరణీయమన్నారు. తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తి నింపిన ఘనత అందెశ్రీకి దక్కుతుందని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం, ఉనికిపై ఆయన రాసిన పాటలు చరిత్రలో నిలిచిపోతాయని కొనియాడారు. 2004లో సంగారెడ్డిలో ధూంధాం కార్యక్రమంలో అందెశ్రీ తనకు పరిచయమయ్యారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు. అందెశ్రీ మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. తన పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. అందెశ్రీ రచనలు, పాటలు, ఉద్యమకాలంలో ఆయనచేసిన సేవలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు పేర్కొన్నారు. అందెశ్రీ భౌతికకాయాన్ని వారు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి.. మనో ధైర్యంతో ఉండాలని కోరారు. తెలుగు సాహితీలోకానికి ఇది తీరని లోటని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని అన్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్‌ కూడా అందెశ్రీ మృతికి సంతాపం తెలిపారు. తన పాటలతో ఈ ప్రాంత వైభవాన్ని చాటిచెప్పిన అందెశ్రీ మరణం తనను దిగ్ర్భాంతికి గురిచేసిందని జాగృతి అద్యక్షురాలు కవిత తెలిపారు. ‘ఊరు మనదిరా’, ‘ఎర్రసముద్రం’, ‘వేగు చుక్క’ సినిమాలకు అందెశ్రీ అమోఘమైన పాటలు అందించారని, ఆయన ఆత్మకు దేవుడిని ప్రార్థిస్తున్నట్లు సినీ నటుడు ఆర్‌.నారాయణ మూర్తి పేర్కొన్నారు. కాగా, ఎంపీ ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, టీజేఎస్‌ ధ్యక్షుడు కోదండరాం, డీజీపీ బి.శివధర్‌రెడ్డి, హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు కె.శ్రీనివాస్‌ తదితరులు అందెశ్రీ భౌతికకాయానికి నివాళులర్పించారు.

Updated Date - Nov 11 , 2025 | 02:53 AM