Prime Minister Modi expressed grief: సౌదీ ప్రమాదం.. అత్యంత దురదృష్టకరం
ABN , Publish Date - Nov 18 , 2025 | 05:38 AM
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు....
ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ దిగ్ర్భాంతి
ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉండండి
సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సూచన
న్యూఢిల్లీ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ‘‘మదీనా వద్ద జరిగిన ప్రమాదంలో భారత పౌరులు చనిపోవడం అత్యంత దురదృష్టకరం. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ సహాయక చర్యలు అందిస్తున్నాయి. సౌదీ ప్రభుత్వ అధికారులతో భారత ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు’’ అని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే, మదీనా సమీపంలో జరిగిన ప్రమాదంలో భారతీయులు మృతి చెందడం అత్యంత బాధాకరమని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విచారం వ్యక్తం చేశారు. ‘‘సౌదీ ప్రమాద విషాదం నన్ను తీవ్రంగా బాధించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. హైదరాబాద్‌లోని బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సూచించాను‘‘ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.