Share News

Kaleshwaram Barrages: కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు.. డిజైన్లు, సమగ్ర ప్రణాళికలు ఇవ్వండి

ABN , Publish Date - Oct 02 , 2025 | 05:26 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్థరణకు డిజైన్లతో పాటు సమగ్ర పునరుద్థరణ ప్రణాళికను అందించడానికి ప్రతిష్ఠాత్మక సంస్థల....

Kaleshwaram Barrages: కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు.. డిజైన్లు, సమగ్ర ప్రణాళికలు ఇవ్వండి

  • 15 ఏళ్ల అనుభవం కలిగిన సంస్థల నుంచి కోరిన నీటిపారుదల శాఖ

హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్థరణకు డిజైన్లతో పాటు సమగ్ర పునరుద్థరణ ప్రణాళికను అందించడానికి ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ)ను ఆహ్వానిస్తూ నీటిపారుదల శాఖ బుధవారం నోటీసు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్థరణ విషయంలో జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ తుది నివేదికలో చేసిన సిఫారసులకు అనుగుణంగా డిజైన్లు అందించాలని అందులో కోరింది. బ్యారేజీల ప్రస్తుత డిజైన్లతోపాటు ఎన్‌డీఎ్‌సఏ నివేదికల్లోని సిఫారసులను పునఃసమీక్షించాలని కోరింది. అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి జియోటెక్నికల్‌, జియోఫిజికల్‌ పరీక్షలు జరిపి బ్యారేజీలలో లోపాలను గుర్తించాలని పేర్కొంది. ఎన్‌డీఎ్‌సఏ సిఫారసు మేరకు మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకును పటిష్ఠం చేయడం లేదా సురక్షితంగా తొలగించే అంశంపై అధ్యయనం జరిపి తగిన పరిష్కారాలను సూచించాలని తెలిపింది. పక్కనే ఉన్న బ్లాక్‌లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా 7వ బ్లాక్‌ను తొలగించే విధంగా ఈ పరిష్కారాలు ఉండాలని షరతు విధించింది. ఎంపికైన సంస్థ అందించే డిజైన్లు, డ్రాయింగ్స్‌కి కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం పొందాల్సి ఉంటుందని తెలిపింది. ఆసక్తి గల సంస్థ/జాయింట్‌ వెంచర్‌ కంపెనీ గత 15 ఏళ్లలో కనీసం ఒకటి రెండు ప్రాజెక్టుల పునరుద్థరణ పనులు చేసి ఉండాలని నిర్దేశించింది. పర్‌మియబుల్‌ ఫౌండేషన్‌తో కూడిన బ్యారేజీల డిజైన్లతో పాటు పునరుద్ధరణ పనుల్లో, అందులోనూ సీకెంట్‌ పైల్స్‌ కటా్‌ఫల పనుల్లో అనుభవం ఉండాలని పేర్కొంది. సంస్థ వార్షిక టర్నోవర్‌ కనీసం రూ.10 కోట్ల దాకా ఉండాలని.. ఐదేళ్లకాలానికి సంబంధించిన బ్యాలెన్స్‌ షీట్‌లు సమర్పించాలని షరతు విధించింది. ఆసక్తిగల సంస్థలు 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆసక్తి వ్యక్తపరుస్తూ టెండర్‌ దాఖలు చేయాలని కోరింది.

Updated Date - Oct 02 , 2025 | 05:26 AM