CV Anand on Ravi Arrest: రవి అరెస్టుతో పైరసీ ఆగదు
ABN , Publish Date - Nov 20 , 2025 | 05:30 AM
ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టుతో పైరసీ ఆగుతుందా.. అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్న క్రమంలో హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి సీవీ ఆనంద్ ట్విటర్ వేదికగా స్పందించారు....
ఒకడు పోతే మరొకడు వస్తాడు
హ్యాకర్లు, హ్యాకింగ్ కొనసాగుతూనే ఉంటాయి
నేర నివారణే ముఖ్యం: సీవీ ఆనంద్ ట్వీట్
హైదరాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టుతో పైరసీ ఆగుతుందా.. అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్న క్రమంలో హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి సీవీ ఆనంద్ ట్విటర్ వేదికగా స్పందించారు. అతడి అరెస్టుతో పైరసీ ఆగదన్నారు. రవిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్స్ డీసీపీ కవిత, ఆమె బృందాన్ని, హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్‌ను ఒక పోస్టు లో ఆయన అభినందించారు. అలాగే మరో పోస్టులో హ్యాకర్లు, హ్యాకింగ్ కొనసాగుతూనే ఉంటుందని, ఒకరు పోతే మరొకరు వస్తారని, అది కూడా మరింత అధునాతనంగా అంటూ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. కొందరిని అరెస్టు చేశామన్న కారణంగా పైరసీ లేదా సైబర్ క్రైమ్స్ పూర్తిగా ఆగిపోతాయని అనుకోవడం అసాధ్యమైన ఆశ వంటిదని అభిప్రాయపడ్డారు. పెద్ద సాంకేతిక నైపుణ్యం ఉన్న దొంగల ముఠాలను పట్టుకున్న తర్వా త దొంగతనాలు, చోరీలు, మోసాలు ఆగిపోయాయా? అని ప్రశ్నించారు. మన చేతిలో ఉన్నది నేరం జరగకుండా అప్రమత్తంగా ఉండటమేనని ఆయన పేర్కొన్నారు. తక్షణమే డబ్బు సంపాదించాలనే ఆలోచనను తగ్గించుకోవాలని.. సైబర్ క్రైం పెరగడానికి అదే మూల కారణమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తమ సైబర్ స్పేస్ ఖాతాలు రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాన్ని వెంటనే గుర్తించే విధంగా ఉండాలని ఆయన సూచించారు. ‘జీవితంలో ఏదీ ఉచితంగా రాదు’ అని గతంలో సినీ దర్శకుడు రాజమౌళి చెప్పిన మాటే జీవితానికి సంబంధించిన అసలైన నిజం అని ఆయన అభిప్రాయపడ్డారు.