Pilot Absent from Flight: ఇంట్లో పైలట్.. విమానంలో ప్రయాణికులు!
ABN , Publish Date - Nov 11 , 2025 | 02:28 AM
విమానంలో ప్రయాణికులంతా ఎక్కి కూర్చోగా.. పైలట్ మాత్రం ఎంచక్కా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉండిపోయాడు. గంటకుపైగా వేచి చూసినా పైలట్ రాకపోవడంతో.....
గంటకుపైగా నిరీక్షణ.. సిబ్బందితో వాగ్వాదం
మరో విమానానికి బాంబు బెదిరింపు
శంషాబాద్ రూరల్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): విమానంలో ప్రయాణికులంతా ఎక్కి కూర్చోగా.. పైలట్ మాత్రం ఎంచక్కా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉండిపోయాడు. గంటకుపైగా వేచి చూసినా పైలట్ రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన సోమవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. 6ఈ 6467 ఇండిగో విమానం 178 మంది ప్రయాణికులతో ఉదయం 6.45 గంటలకు మధురై బయలుదేరాల్సి ఉంది. ప్రయాణికులతోపాటు సిబ్బంది కూడా అందరూ విమానంలో రెడీగా ఉన్నారు. పైలట్ కోసం గంటకు పైగా వేచిచూసిన ప్రయాణికులు చివరకు విసుగెత్తి ఆందోళనకు దిగారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎయిర్‌లైన్స్ అధికారులు మరో పైలట్‌ను రప్పించి విమానాన్ని పంపించారు. ఇదిలా ఉండగా.. ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి విశాఖపట్నం వెళ్లిన 6ఈ 618 ఇండిగో విమానం ఏడుగురు ప్రయాణికులను ఎక్కించుకోకుండానే వెళ్లిపోయింది. అధికారులు ఆ ఏడుగురిని మరో విమానంలో పంపేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, లండన్ నుంచి 200మంది ప్రయాణికులతో సోమవారం తెల్లవారుజామున శంషాబాద్‌కు చేరుకున్న బీఏ 277 బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ఈ బాంబు ఉందంటూ ఆగంతకులు జీఎంఆర్ మెయిల్‌కు సందేశం పంపారు. సీఐఎ్‌సఎఫ్, సీఆర్‌పీఎఫ్, స్థానిక పోలీసులు.. విమానాన్ని తనిఖీ చేసి ఎలాంటి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.