Land Dispute: చీరతో చేతులు కట్టేసి.. మెడకు బిగించి..
ABN , Publish Date - Nov 04 , 2025 | 02:32 AM
భూ తగాదా కేసులో సాక్షిగా ఉన్న ఓ యువ ఫొటోగ్రాఫర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సొంత పొలానికి సమీపంలోని మామిడితోటలో..
భూ తగాదా కేసులో సాక్షిగా ఉన్న ఫొటోగ్రాఫర్ హత్య!
చిలుపూర్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): భూ తగాదా కేసులో సాక్షిగా ఉన్న ఓ యువ ఫొటోగ్రాఫర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సొంత పొలానికి సమీపంలోని మామిడితోటలో అతని మృతదేహాన్ని కనుగొన్నారు. చీరతో అతని చేతులు కట్టేసి, అదే చీర మెడకు చుట్టి ఉంది. జనగామ జిల్లా చిలుపూర్ మండలం కొండాపూర్‌లో ఈ ఘటన జరిగింది. ముత్యాల సురేశ్(34) ఫొటో స్టూడియో నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి భార్య, మూడు నెలల కుమారుడు ఉన్నారు. గ్రామానికి చెందిన మోతె జితేందర్, మోతె జిన్ను అనే అన్నదమ్ములకు, అదే గ్రామానికి చెందిన మోతె కిష్టయ్య, రాములు, రమేశ్, ఓదేలు, సంపత్, కొమురయ్యకు మధ్య కొన్నేళ్లుగా భూ తగాదాలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం జితేందర్, జిన్ను ప్రత్యర్థులు ఆరుగురిపై దాడి చేశారు. అప్పట్లో వారిద్దరిపై కేసు కూడా నమోదైంది. ఆ కేసులో సురేశ్ ప్రత్యక్ష సాక్షి కావడమే కాకుండా, గొడవను వీడియో తీశాడన్న కోపంతో అతనిపై జితేందర్, జిన్ను పగ పెంచుకున్నట్లు తెలుస్తోంది. సురేశ్ ఆదివారం సాయంత్రం పొలానికి వెళ్లి రాత్రయినా ఇంటికి రాలేదు. సోమవారం ఉదయం పొలానికి సమీపంలోని మామిడి తోటలో విగతజీవిగా కనిపించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.