Etela Rajender: ప్రతి నిమిషం నా ఫోన్‌పై నిఘా
ABN , Publish Date - Jun 25 , 2025 | 06:53 AM
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఎందుకు నత్తనడకన సాగుతోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. తమ ఫోన్లను ట్యాప్‌చేయాలంటూ ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును ఆదేశించింది ఎవరు?
సిట్ ఏర్పాటు చేసి ఏడాది దాటిపోయింది
కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి ఉందా?
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లాలూచీ పడ్డాయా?
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వండి
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్
2021 నుంచే తనపై నిఘా పెట్టారని వెల్లడి.. సిట్ ఎదుట మళ్లీ వాంగ్మూలం
సిట్‌కు వాంగ్మూలం ఇచ్చిన బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి, టీడీపీ నేత కిశోర్‌బాబు
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఎందుకు నత్తనడకన సాగుతోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. తమ ఫోన్లను ట్యాప్‌చేయాలంటూ ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును ఆదేశించింది ఎవరు? డేటా ఎందుకు ధ్వంసం చేశారనే విషయాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధ్యులు ఎంతటి వారైనా, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని.. లేకపోతే ఈ ప్రభుత్వం వారితో కుమ్మక్కైనట్లుగా భావించాల్సి ఉంటుందని అన్నారు. 2021 నుంచి ప్రతి నిమిషం తన ఫోన్లపై నిఘా పెట్టారని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ విభాగం సీఎం అధీనంలో ఉంటుందని, అప్పుడు సీఎంగా కేసీఆర్ ఉన్నారని.. ఈ విషయం రేవంత్‌రెడ్డికి తెలియదా? అని ఈటల ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం ఆయన సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ ప్రక్రియ సుమారు గంటన్నర పాటు కొనసాగింది.
అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ ఏర్పాటు చేసి ఏడాది దాటిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అంశాలపై కమిషన్లు వేసిందని, కాళేశ్వరంపై ఇంకా నివేదిక రాలేదని, అసలు ప్రభుత్వానికి నిజాయితీ ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని చెప్పే రేవంత్‌రెడ్డి దీనికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం లేకపోతే, లాలూచీ పడకపోతే విచారణ ఎందుకు నత్తనడకన సాగుతోందని ఈటల ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలెందుకు తీసుకోవడం లేదో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ లాంటి హేయమైన నేరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. అలా చేయకపోతే బీఆర్‌ఎ్‌సతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కైనట్లు భావించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును నిష్పక్షపాతంగా విచారించాలని, లేదంటే సీబీఐకి అప్పగించాలని ఈటల డిమాండ్ చేశారు. తమ పార్టీ నాయకుల మధ్య జరిగిన సంభాషణల డేటాను అధికారులు చూపించారని, ట్యాపింగ్ ఎవరు చేయించారనే విషయంపై తన అనుమానాలను సిట్‌కు వివరించానని తెలిపారు.
తనతో పాటు భార్య, ఇతర కుటుంబసభ్యులు, సన్నిహితుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని గతంలో తాను ఆరోపించిన విషయం ప్రస్తుతం సిట్ ద్వారా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికల సమయం నుంచే తన ఫోన్లు ట్యాపింగ్ చేయడం ప్రారంభించారని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే అధికారం ఎవ రికీ లేదని, తన ఫోన్లు ట్యాపింగ్ చేసి ఎన్నికల్లో ఓడించాలని విశ్వప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు. ప్రభాకర్‌రావు ఐపీఎస్ కాదని.. ప్రమోటీ అని, తాను చెప్పినట్లు పనిచేసే వారు ఉండాలనే కేసీఆర్ అతన్ని నియమించుకున్నాడని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావు, భుజంగరావు, రాధాకిషన్‌రావు, తిరుపతన్నలతోపాటు వారిపైన ఉన్న అధికారులు, నేతల ప్రమేయం కూడా ఉందని చెప్పారు. గవర్నర్‌గా పనిచేసిన ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలంటే ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ఈటల డిమాండ్ చేశారు. తన భార్య నడుపుతున్న జమున హ్యాచరీ్‌సకు సంబంధించిన అందరి ఫోన్లూ ట్యాప్ చేశారని, వారి మధ్య జరిగిన చాటింగ్‌ను సిట్ అధికారులు తనకు చూపించారని చెప్పారు. అధికారులందరూ ప్రభాకర్‌రావు చెబితేనే ట్యాపింగ్ చేశామంటున్నారని.. ఆయన ఎవరి అండతో ఈ పని చేశారో తేల్చాలని డిమాండ్ చేశారు.
2 ఫోన్లు ట్యాప్ చేశారు: ప్రేమేందర్‌రెడ్డి బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి మంగళవారం సిట్ విచారణకు హాజరయ్యారు. తన రెండు ఫోన్లను ట్యాప్ చేశారని, గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగా బీజేపీ కొన్ని స్థానాల్లో ఓడిపోయిందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ దోషులు బయటపడాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
ట్యాపింగ్ వెనక బీఆర్‌ఎస్ నేతలు: కిశోర్‌బాబు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020 నుంచి సాధారణ ఎన్నికల వరకు తన ఫోన్‌ను ట్యాప్ చేసి, పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురిచేసిందని తెలంగాణ టీడీపీ సంస్థాగత కార్యదర్శి వేజెండ్ల కిశోర్‌బాబు సిట్‌కు ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు కలిసి తన ఫోన్‌తో పాటు ఇతర టీడీపీ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేయించారని గతంలో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని కిశోర్ చెప్పారు. కానీ, పోలీసులు తన ఫిర్యాదును మూసివేస్తున్నట్లు తెలిపారని, తాజాగా సిట్ దర్యాప్తు జరిపించాలని కోరారు.