KCR: కేసీఆర్‌ను పిలవడమే తరువాయి..
ABN , Publish Date - Dec 26 , 2025 | 05:42 AM
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది అంకానికి చేరింది. ఈ కేసులో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను విచారణకు పిలవడం కూడా దాదాపు ఖాయమైంది...
క్లైమాక్స్‌కు చేరిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ
నందకుమార్ వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్‌పై బాణం
చివరిరోజు విచారణలో ప్రభాకర్‌రావు ఉక్కిరిబిక్కిరి
కుమారుడి విచారణతో ఆయనపై ఒత్తిడి పెంచే వ్యూహం
ఐదుగురు నిందితులతో ముఖాముఖి విచారణ
స్వయంగా ప్రశ్నించిన సిట్ చీఫ్ సజ్జనార్!
సిట్ బృందంతో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయకుమార్ భేటీ
హైదరాబాద్, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది అంకానికి చేరింది. ఈ కేసులో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను విచారణకు పిలవడం కూడా దాదాపు ఖాయమైంది. ప్రభాకర్‌రావు చివరిరోజు విచారణలో అతని కుమారుడితోపాటు గతంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో అరెస్టు అయిన నందకుమార్‌ను కూడా పిలిచి విచారించటంతో కేసీఆర్‌కు నోటీసులిచ్చే అంశాన్ని సిట్ ఖరారు చేసినట్లేనని చెప్తున్నారు. తన ఫోన్‌ను ట్యాప్ చేసి, ఆ ఆడియోలను నాటి సీఎం కేసీఆర్ బహిర్గతం చేశారని నందకుమార్ సిట్ అధికారులకు తెలిపారు. ఈ అంశంపైౖ అప్పట్లో డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. నందకుమార్ ఫోన్ ట్యాప్ అయ్యిందన్న విషయం నిర్ధారణ కావడం, ఆయన ఆడియోలను విలేకరుల సమావేశంలో కేసీఆర్ బయటపెట్టిన నేపథ్యంలో ఈ ట్యాపింగ్ జరిపించింది ఎవరనే విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వనుంది. నందకుమార్ వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారుతుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. బీఆర్‌ఎస్ పాలనలో దాదాపు 6,000 ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారనే ఆరోపణలున్నాయి. ఎస్‌ఐబీ కార్యాలయాన్ని ట్యాపింగ్ అడ్డాగా మార్చారనే ఆరోపణలపై సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు 14 రోజుల పోలీస్ కస్టడీకి గురువారమే చివరిరోజు కావడంతో.. సిట్ అధికారులు ఆయనను అన్ని కోణాల్లో విచారించారని సమాచారం.
ఈ విచారణలో సిట్ అధిపతి సజ్జనార్‌తోపాటు ఇతర ఐపీఎస్ అధికారులు స్వయంగా పాల్గొన్నారు. ఈ కేసులో అరెస్టు అయిన ఇతర నిందితులు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావుతోపాటు ఓ మీడియా ఛానల్ అధిపతి శ్రవణ్‌రావుతో కలిపి ప్రభాకర్‌రావును ముఖాముఖి ప్రశ్నించినట్లు తెలిసింది. గతంలో వారు ఇచ్చిన వాంగ్మూలాలకు కట్టుబడి ఉన్నారా లేదా? అనే విషయాలపై దర్యాప్తు అధికారులు స్పష్టత తీసుకున్నారని సమాచారం. మరోవైపు ప్రభాకర్‌రావు కుమారుడు నిశాంత్‌రావును కూడా విచారిస్తూ ప్రభాకర్‌రావును ఉక్కిరి బిక్కిరి చేశారు. ఒకరకంగా ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి వ్యూహత్మకంగా సిట్ అధికారులు ప్రయత్నించారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో నాటిసీఎంవో, మాజీ మంత్రుల పేర్లు వచ్చిన నేపఽథ్యంలో ఇందులోని అంశాలపై ప్రభాకర్‌రావును సూటిగా నిలదీసినట్లు తెలిసింది. భుజంగరావు, తిరుపతన్నల వాంగ్మూలాల్లో ప్రభాకర్‌రావు పేరు పలుమార్లు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రవణ్‌రావు తన వాంగ్మూలానికి గతంలో కట్టుబడకుండా కోర్టులో సవాలు చేసిన నేపఽథ్యంలో ఆయన ఆదాయం, ఫోన్ కాల్ వివరాలు, సహ నిందితులతో సెల్‌ఫోన్ టవర్ లోకేషన్ల మ్యాచింగ్ ఆధారాలను చూపించి ప్రభాకర్‌రావుతో కలిపి ఇద్దరిని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో కీలకమైన రాజకీయ కోణాన్ని నిర్ధారించేందుకు నంద కుమార్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
శ్రవణ్‌రావు పాత్రా కీలకమే...
శ్రవణ్‌రావు నాటి బీఆర్‌ఎస్ ప్రముఖుడి ద్వారా సిట్‌లోకి ఎంటరయ్యారని, నాటి మంత్రి హరీశ్‌రావుకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందన్న కోణంలో ప్రైవేటుగా కొన్ని ఫోన్ నెంబర్ల్లపై నిఘా పెట్టారని సిట్ అధికారులు గుర్తించినట్లు తె లుస్తోంది. శ్రవణ్‌రావు హ్యండిల్ చేసిన పోలీసు అధికారులు ఇచ్చిన కీలక సమాచారాన్ని ఆయన వినియోగించుకుని ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టినట్లు గుర్తించారు. ఈ కేసులో శ్రవణ్‌రావు కూడా కీలక వ్యక్తి అని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆయనను ఈ కేసులో ఎగ్జిక్యూటర్‌గా పేర్కొంటున్నారు. టెక్నికల్ ఆపరేషన్లను పర్యవేక్షించడ మే కాకుండా వచ్చిన సమాచారాన్ని అవసరమైన వరకు ఎడిట్ చేసి కొంతమందికి పంపించి శ్రవణ్‌రావు లబ్ధిపొందారన్న విషయంపై ప్రభాకర్ రావును పలుమార్లు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అమెరికాలో గతంలో ఉద్యోగం చేసిన ప్రభాకర్‌రావు కుమారుడు నిశాంత్‌రావు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. ఈ వ్యాపారాలకు వచ్చిన పెట్టుబడులు, నిశాంత్‌రావు ఆర్థిక స్థితి కన్నా ఎక్కువ ఉండటంతో తండ్రి ద్వారా వచ్చిన డబ్బును ఇక్కడికి మళ్లించి ఉండవచ్చని సిట్ అధికారులు అనుమానించి అతని వాంగ్మూలాన్ని రికార్డు చేశారని తెలుస్తోంది. మరోవైపు ప్రభాకర్ రావు పారిపోయిన తర్వాత నిశాంత్‌రావు తన తండ్రికి సంబంధించిన సాక్ష్యాధారాలను నాశనం చేశారన్న కోణంలోనూ ప్రశ్నించినట్లు సమాచారం.
ఇంటెలిజెన్స్ ఆఫీసులోనూ అక్రమ ట్యాపింగ్
ప్రభాకర్ రావు ఎస్‌ఐబీ చీఫ్‌గా 2020 జూన్‌లో రిటైర్ అయ్యారు. ఆ వెంటనే ఆయనను చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ (ఎస్‌ఐబీ) ఓఎ్‌సడీగా ప్రభుత్వం నియమించింది. అంతేకాకుండా కీలకమైన ఇంటెలిజెన్స్ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పదవీ విరమణ పొందిన అధికారిని ఇంటెలిజెన్స్ బాస్‌గా కూర్చోబెట్టడంతో ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంలోని రెండో అంతస్తులో ఉన్న కీలకమైన ట్యాపింగ్ విభాగానికి ఆయనకు నేరుగా యాక్సెస్ లభించినట్లయ్యిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఎస్‌ఐబీలోనే కాకుండా ఇంటెలిజెన్స్ కార్యాలయం నుంచి సైతం ట్యాపింగ్ దందాకు పాల్పడ్డారని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సిట్ బృందంతో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయకుమార్ గురువారం భేటీ అయ్యారు. సిట్ చీఫ్ సజ్జనార్‌తో పాటు సిట్ సభ్యులతో ఆయన మాట్లాడి కేసు పురోగతిని తెలుసుకున్నారు. నాటి ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్న క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభాకర్ రావు విచారణ నివేదికను సుప్రీంకోర్టుకు పంపించాల్సి ఉన్నందున.. అధికారులు నివేదికను సిద్ధం చేస్తున్నారు.