Share News

Commissioner Sajjanar: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు ఇక..సజ్జనార్‌ నేతృత్వంలో

ABN , Publish Date - Dec 19 , 2025 | 04:10 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే సిట్‌ దర్యాప్తు కొనసాగిస్తుండగా..

Commissioner Sajjanar: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు ఇక..సజ్జనార్‌  నేతృత్వంలో

  • 9 మంది సీనియర్‌ పోలీసు అధికారులతో సిట్‌ బలోపేతం

  • ఉత్తర్వులిచ్చిన డీజీపీ.. నెలలో దర్యాప్తు పూర్తికి ఆదేశం

హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే సిట్‌ దర్యాప్తు కొనసాగిస్తుండగా.. తాజాగా హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కేసు దర్యాప్తును వేగవంతం చేయడానికి సీనియర్‌ పోలీసు అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బృందంలో రామగుండం కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, సిద్దిపేట సీపీ ఎస్‌.ఎం.విజయ్‌కుమార్‌, మాదాపూర్‌ డీసీపీ రితిరాజ్‌, మహేశ్వరం డీసీపీ కె.నారాయణరెడ్డి, గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌ ఎం.రవీందర్‌ రెడ్డి, రాజేంద్రనగర్‌ ఏడీసీపీ కేఎస్‌ రావు, జూబ్లీహిల్స్‌ ఏసీపీ పి.వెంకటగిరి(దర్యాప్తు అధికారి), నాగేందర్‌రావు(హెచ్‌ఎంఆర్‌ఎల్‌), సీహెచ్‌ శ్రీధర్‌ (టీజీన్యాబ్‌)ను నియమించారు. ట్యాపింగ్‌ కేసు దర్యాప్తును నెలరోజుల వ్యవధిలో పూర్తిచేయాలని నిర్దేశించారు. ఈ కేసులో భిన్న కోణాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరికి ఒక్కో కీలక అంశానికి సంబంధించిన బాధ్యతలను అప్పగించారు. దీంతో ట్యాపింగ్‌కు సంబంధించి రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి, ఆదేశాలు ఇచ్చిన వారికి, ఆదేశాలు తీసుకుని అమలు చేసినవారికి మధ్య సంబంధాన్ని తేల్చాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Updated Date - Dec 19 , 2025 | 04:10 AM