Share News

Kaloji Health University: ఆ పీజీ వైద్య విద్యార్థిని ఉత్తీర్ణత చెల్లదు

ABN , Publish Date - Dec 27 , 2025 | 04:08 AM

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఎన్‌ఎంసీ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఓ ప్రైవేటు వైద్య కళాశాలకు చెందిన పీజీ వైద్య విద్యార్థినిని పాస్‌ చేయించిన వ్యవహారంలో..

Kaloji Health University: ఆ పీజీ వైద్య విద్యార్థిని ఉత్తీర్ణత చెల్లదు

  • సర్కారుకు హెల్త్‌ వర్సిటీ లేఖ

  • ఎగ్జిక్యూటివ్‌ కమిటీ తుది నిర్ణయం

హైదరాబాద్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఎన్‌ఎంసీ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఓ ప్రైవేటు వైద్య కళాశాలకు చెందిన పీజీ వైద్య విద్యార్థినిని పాస్‌ చేయించిన వ్యవహారంలో.. ఆ విద్యార్థిని ఉత్తీర్ణత చెల్లదని వర్సిటీ ఉన్నతాధికారులు ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) నిబంధనలను ఉటంకిస్తూ రాష్ట్రప్రభుత్వానికి వర్సిటీ ఓ నివేదిక సమర్పించింది. హెల్త్‌ వర్సిటీ నుంచి వచ్చిన లేఖను పరిశీలించిన ప్రభుత్వం.. నిబంధనల మేరకు నిర్ణయం తీసుకోవాలని తిరిగి వర్సిటీ ఉన్నతాధికారులకే సూచించినట్లు సమాచారం. దీంతో ఈ వివాదాస్పద అంశంపై త్వరలో ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశ మై, తుది నిర్ణయం తీసుకోనుందని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశంలో సదరు విద్యార్థిని ఉత్తీర్ణతను అధికారికంగా రద్దు చేసి, ఆమెను తిరిగి పరీక్ష రాయాలని ఆదేశించే అవకాశం ఉందని సమాచారం.

వివాదం నేపథ్యం..

ఈ ఏడాది నవంబరు 4న విడుదలైన వైద్య విద్య పీజీ ఫలితాలలో సదరు మెడిసిన్‌ విద్యార్థిని రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయింది. ఆమె హాల్‌ టికెట్‌ నంబరు కూడా జాబితాలో లేదు. అయితే, అదే నెల 21న పాస్‌ అయినట్లు వర్సిటీ మెమో విడుదల చేయడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై ‘ఆంఽధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించడంతో ప్రభుత్వం రంగంలోకి దిగి కమిటీని ఏర్పాటు చేసింది. జాతీయ వైద్య కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా సదరు పీజీ విద్యార్థిని జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేసినట్లు ఆ కమిటీ నివేదికలో పేర్కొంది. దీంతో అప్పటి వీసీ డాక్టర్‌ నందకుమార్‌ రెడ్డితో ప్రభుత్వం బలవంతంగా రాజీనామా చేయించి, ఇన్‌చార్జి వీసీ బాధ్యతలను యాదాద్రి భువనగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డికి అప్పగించింది.

డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా విక్టర్‌

డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వి.విక్టర్‌, ప్రధాన కార్యదర్శిగా వి.చంద్రకళ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో శుక్రవారం తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై పలు తీర్మాణాలు చేయడంతో పాటు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోశాధికారిగా వెంకటేశ్వర్లు, అసోసియేట్‌ అధ్యక్షులుగా చంద్రావతి, నగేశ్‌, మహిపాల్‌రెడ్డి, హనుమా నాయక్‌, రాజేశ్వరి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా ఉపేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం 2028 వరకు పనిచేస్తుందని ఎన్నికల నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షుడు చంద్రమోహన్‌, ప్రధాన కార్యదర్శి శ్రీనివా్‌సరెడ్డి, అడిషనల్‌ కలెక్టర్లు, స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 04:08 AM