PG Near Niloufer Hospital Campus: నీలోఫర్‌లో పీజీ హాస్టల్ భవనాలు
ABN , Publish Date - Sep 24 , 2025 | 03:35 AM
నీలోఫర్ ఆస్పత్రి ఆవరణలో పీజీ వైద్య విద్యార్థులకు హాస్టల్ భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భవనాల్లో పీజీ వైద్య విద్యార్థులు...
నీలోఫర్ ఆస్పత్రి ఆవరణలో పీజీ వైద్య విద్యార్థులకు హాస్టల్ భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భవనాల్లో పీజీ వైద్య విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లతోపాటు 280 (180 మంది మహిళా డాక్టర్లు, 100 మంది పురుష డాక్టర్లు) మంది వైద్యులకు వసతి కల్పించనున్నారు. ఈ విషయమై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు మంగళవారం ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్థు అధ్యక్షతన జరిగిన నీలోఫర్ హాస్పిటల్ డెవల్‌పమెంట్ సొసైటీ సమావేశంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, డీఎంఈ నరేంద్ర కుమార్, జోనల్ కమిషనర్ అనురాగ్ ఠాకూర్, టీజీఎంఎ్‌సఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హాస్టల్ భవనాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించామని, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు క్రిస్టినా జడ్ చొంగ్థు ఓ ప్రకటనలో తెలిపారు. వందల మంది వైద్యులు 24 గంటలు ఆస్పతిలో అందుబాటులో ఉండటంతో రోగులకు మెరుగైన వైద్య సేవలందుతాయని క్రిస్టినా పేర్కొన్నారు. ఆవరణలోని ధర్మశాల భవనాన్ని నీలోఫర్ ఆస్పత్రికి అప్పగించాలని జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌ను ఆదేశించిన క్రిస్టినా.. ఈ భవనంలోని 72 రూములను రోగుల సహాయకుల వినియోగంలోకి తెస్తామన్నారు.ఇక ఆస్పత్రి వద్ద ట్రాఫిక్ నియంత్రణ, రద్దీని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు.