Surveillance Cameras: మహిళల భద్రత దృష్ట్యా నిఘా కెమెరాలను నియంత్రించండి
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:45 AM
మహిళల వ్యక్తిగత జీవనానికి విఘాతం కలుగుతున్న దృష్ట్యా నిఘా కెమెరాల విక్రయాలను నియంత్రించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది.
హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మహిళల వ్యక్తిగత జీవనానికి విఘాతం కలుగుతున్న దృష్ట్యా నిఘా కెమెరాల విక్రయాలను నియంత్రించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. హెవెన్స్ హోం సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు జి. వరలక్ష్మి ఈ పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 29న పోలీసుశాఖలోని మహిళా భద్రతా విభాగం జారీ చేసిన సర్క్యులర్ అమలయ్యేలా చూడాలని కోరారు. దాని ప్రకారం నిఘా కెమెరాలు విక్రయించే వ్యక్తులు తమ దుకాణాల వద్ద అనుమతి లేకుండా వీడియోలు చిత్రీకరిస్తే మూడేళ్లవరకు జైలుశిక్ష, రూ. 2 లక్ష జరిమానా విధించే అవకాశం ఉందంటూ బోర్డులు పెట్టాల్సి ఉంటుంది.
హోటళ్లు, హాస్టళ్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు తదితర ప్రాంతాల్లో మహిళల వీడియోలను చిత్రీకరిస్తున్న నేపథ్యంలో ఆ ఆదేశాలు ఇచ్చింది. ఇవి అమలయ్యేలా చూడాలని కోరారు. వాదనలు విన్న జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం.. పిటిషనర్ విజ్ఞప్తిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ, ఇతర అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకుంటుందో వివరాలు తెలియజేయాలని హోంశాఖకు ఆదేశాలు జారీచేసింది.