Share News

TG High Court: హైకోర్టును తప్పుదోవ పట్టించాలని చూసిన వ్యక్తికి కోటి జరిమానా..

ABN , Publish Date - Mar 19 , 2025 | 06:16 AM

సివిల్‌ వివాదంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసే దురుద్దేశంతో హైకోర్టును తప్పుదోవ పట్టించాలనుకున్న వ్యక్తికి గట్టి షాక్‌ తగిలింది.

TG High Court: హైకోర్టును తప్పుదోవ పట్టించాలని చూసిన వ్యక్తికి కోటి జరిమానా..

  • విలువైన ప్రభుత్వ భూమి కొట్టేయాలని కుట్ర

  • తప్పుడు పత్రాలు, వాస్తవాలు దాచిపెట్టి పిటిషన్లు

  • ఏప్రిల్‌ 10లోగా జరిమానా చెల్లించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నగేశ్‌ తీర్పు

హైదరాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): సివిల్‌ వివాదంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసే దురుద్దేశంతో హైకోర్టును తప్పుదోవ పట్టించాలనుకున్న వ్యక్తికి గట్టి షాక్‌ తగిలింది. తప్పుడు పత్రాలతో తనకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు పొందాలనుకున్న ఆ వ్యక్తికి హైకోర్టు రూ.కోటి జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని ఏప్రిల్‌ 10లోగా హైకోర్టు లీగల్‌సెల్‌ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే ఈ కేసును మళ్లీ ఏప్రిల్‌ 11న విచారణ చేపట్టే కేసుల జాబితాలో ఉంచాలని జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ఏకసభ్య ధర్మాసనం రిజిస్ట్రీకి నిర్దేశించింది. భారతీయ సమాజానికి సత్యమే ప్రధానమైన పునాది అని, నిజాయితీ, సత్యం, నైతిక విలువలపైనే భారతీయ తత్వం ఆధారపడి ఉందని భగవద్గీత, ఉపనిషత్తులతో పాటు మహాత్మాగాంధీ వంటి నాయకులు ఉద్ఘాటించిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. హైదరాబాద్‌ జిల్లా బండ్లగూడ మండలం కందికల్‌లోని సర్వే నం.310/1, 310/2లో 9.11 ఎకరాల భూమి తనకు వారసత్వంగా సంక్రమించిందని, దాని విషయంలో అధికారులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ నాంపల్లి సంగీత్‌నగర్‌కు చెందిన వెంకటరామిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 1980లో తన తండ్రి పట్టాభిరామిరెడ్డి రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్‌ ద్వారా భూమి కొన్నట్లు తెలిపారు. రెవెన్యూ రికార్డుల్లో పట్టాభూమిగా రికార్డు చేసినా పొరపాటున ‘ఆబాదీ’ భూమిగా రికార్డయి అలాగే కొనసాగినట్లు పేర్కొన్నారు. అయితే అది ప్రభుత్వ భూమి అని, పిటిషనర్‌ ఆక్రమణదారు అని పేర్కొంటూ ఆర్డీవో జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ఆ భూమిలో రిజిస్ట్రేషన్లు కాకుండా నిషేధిత జాబితాలో పెట్టారు. ఇది అక్రమమన్నది పిటిషనర్‌ వాదన. మరోవైపు, ఆర్‌ శ్రీశై లం, ఇతరులు 1989 నుంచి సదరు భూమిపై హక్కులు క్లెయిమ్‌ చేస్తూ సివిల్‌ వివాదం కొనసాగిస్తున్నారని, సెకండ్‌ అప్పీల్‌ రూపం లో సదరు వివాదంలో హైకోర్టులో పెండింగ్‌లో ఉందని తహసీల్దార్‌ పేర్కొన్నారు.


వివాదాలు పెండింగ్‌లో ఉండగా పిటిషనర్‌ 2022 డిసెంబరు 1 నుంచి పిటిషనర్‌ సదరు భూమి లో జోక్యం చేసుకుంటుండటంతో తహసీల్దార్‌ ఫిర్యాదుతో పోలీసు కేసు నమోదైంది. పిటిషనర్‌, పిటిషనర్‌ తండ్రి పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల కోసం, రికార్డుల సవరణ, తమ ఆస్తిలో అధికారులు జోక్యం చేసుకోవద్దని వివిధ కారణాలతో హైకోర్టులో 4 పిటిషన్లు వేసి ఉపసంహరించుకున్నారు. వాటి వివరాలు వెల్లడించకుండా 2024లో మరో రెండు పిటిషన్లు దాఖలు చేసి యథాతథ స్థితి కొనసాగించాలనే ఉత్తర్వులు పొందారు. పోలీసు కేసులైన తర్వాత పిటిషనర్‌ సదరు భూమి తమదేనని సివిల్‌ కోర్టులో దావా వేశారు. అందులో ఎక్స్‌పార్టీ ఆదేశాలు రావడంతో అంతకుముందు నుంచి వివాదం కొనసాగిస్తున్న పార్టీలను ఖాళీ చేయించేందుకు యత్నాలు మొదలుపెట్టారు. తమకు అనుకూలంగా ఆదేశాలు తెచ్చుకునేందుకు వివిధ ధర్మాసనాల వద్ద కేసులు వేస్తూ ‘ఫోరం షాపింగ్‌’ చేస్తున్నారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘విక్రయించారని పిటిషనర్‌ పేర్కొంటున్న వ్యక్తులు మొదటి నుంచి వివాదం కొనసాగిస్తున్నారు. వారి వివాదం సెకండ్‌ అప్పీల్‌ రూపంలో హైకోర్టు పెండింగ్‌లో ఉండటంతో పాటు వారికి అనుకూలంగా ఇన్‌జంక్షన్‌ ఆర్డర్‌ ఉంది. వాస్తవాలు దాచి కోర్టును తప్పుదోవ పట్టించేలా పిటిషన్లు వేస్తూ విలువైన కోర్టు సమయాన్ని వృథా చేయడంతో పాటు కేసుల పెండింగ్‌ భారం పెరిగిపోవడానికి పిటిషనర్‌ లాంటి వ్యక్తులు కారణమవుతున్నారు. పిటిషనర్‌ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి సదరు విలువైన భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు. ఒకే అంశంపై వివిధ కోర్టులను ఆశ్రయిస్తూ న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసేలా న్యాయపరమైన ప్రత్యామ్నాయల పేరు తో వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. రూ.కోటి భారీ జరిమానా విధిస్తూ పిటిషన్‌ను కొట్టేస్తున్నామ’ని ధర్మాసనం పేర్కొంది.

Updated Date - Mar 19 , 2025 | 07:41 AM