Persistent Young Leader Navin Yadav: పట్టు వదలని విక్రమార్కుడు
ABN , Publish Date - Nov 15 , 2025 | 05:17 AM
ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని పదేళ్లుగా పట్టిన పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్న వల్లాల నవీన్‌యాదవ్.. ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో...
ముచ్చటగా మూడో ప్రయత్నంలో..
గతంలో రెండుసార్లు జూబ్లీహిల్స్‌లో పోటీచేసిఓటమి
మూడో ప్రయత్నంలో కలసాకారం చేసుకున్న యువ నేత
హైదరాబాద్ సిటీ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని పదేళ్లుగా పట్టిన పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్న వల్లాల నవీన్‌యాదవ్.. ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో తన కలను నిజం చేసుకున్నారు. నిజానికి ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గతంలో తీవ్రంగా ప్రయత్నించారు. చిన్న శ్రీశైలంకు చాలాసార్లు పలు రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే టికెట్ ఆశచూపి, చివరకు మొండిచెయ్యి చూపాయి. తన కుటుంబం నుంచి ఎమ్మెల్యే ఉండాలన్న ఆయన ఆశయాన్ని చివరకు ఆయన కుమారుడు సాధించాడు. నవీన్‌యాదవ్ 2014లో ఎంఐఎం తరఫున పోటీ చేసి 41,656 ఓట్లు (25.19 శాతం) సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున పోటీచేసిన మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేన నవీన్‌యాదవ్.. 18,817 ఓట్లు (12.09 శాతం) సాధించి మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించగా.. మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు టికెట్ లభించింది. దీంతో భవిష్యత్‌లో అవకాశం ఇస్తామని అప్పుడే కాంగ్రెస్ పెద్దలు నవీన్‌యాదవ్‌కు హామీ ఇచ్చారు. అన్నట్లుగానే ఉప ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వటంతో 98,988 ఓట్లు సాధించి, మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో గెలిచారు. నవీన్‌యాదవ్ కుటుంబానికి మొదటి నుంచీ కాంగ్రెస్ దివంగత నేత పీ జనార్ధన్‌రెడ్డితోపాటు ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ కుటుంబాలతో పరిచయాలున్నాయి.