Permissions Cancelled: ఫాతి సభకు అనుమతులు రద్దు
ABN , Publish Date - Nov 07 , 2025 | 02:29 AM
ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిల కోసం నిరవధిక సమ్మె చేస్తున్న ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘాల సమాఖ్య...
అసెంబ్లీ పరిసరాల్లో సభకు అనుమతించబోమన్న పోలీసులు
హైకోర్టును ఆశ్రయించిన ఫాతి.. నేడు విచారణ
11న తలపెట్టిన విద్యార్థుల మహా ర్యాలీ 15కి వాయిదా
శ్రీ దేవసేనపై ‘ఫాతి’ వ్యాఖ్యలు అభ్యంతరకరం
ఖండించిన తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం
హైదరాబాద్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిల కోసం నిరవధిక సమ్మె చేస్తున్న ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘాల సమాఖ్య (ఫాతి) సభకు ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దుచేసింది. కాలేజీల సిబ్బంది లక్ష మందితో ఎల్బీ స్టేడియంలో శనివారం ‘అధ్యాపకుల సాంత్వన సభ’ నిర్వహించనున్నట్టు ఫాతి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి తొలుత అనుమతులు ఇచ్చిన పోలీసు శాఖ.. గురువారం ఆ అనుమతులను రద్దు చేసింది. అసెంబ్లీ పరిసరాల్లో సభలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఎల్బీ స్టేడియం స్థానంలో సికింద్రాబాద్ స్టేడియం, ఉప్పల్ స్టేడియం, లేదా సరూర్‌నగర్ స్టేడియం కేటాయించాలని కోరినా పోలీసులు అనుమతించలేదు. దీనిపై ఫాతి హైకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం ఉదయం దీనిపై విచారణ జరగనుంది. ఇక.. 10 లక్షల మంది విద్యార్థులతో 11న నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్‌ను 15వ తేదీకి వాయిదా వేసినట్టు ఫాతి అధ్యక్షుడు నిమ్మటూరి రమే్‌షబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం సగం బకాయిలు చెల్లించనంతరవరకూ సమ్మె కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కాగా.. సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, విద్యా శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి శ్రీదేవసేనపై ఫాతి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. అధికారులుగా తాము రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నామని.. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని.. ఫాతివ్యాఖ్యలు ఆమె గౌరవానికి భంగం కలిగించాయని సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆమెపై చేసిన వ్యాఖ్యలను ఫాతి ప్రతినిధులు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.