Share News

నకిలీ బంగారంతో ప్రజలకు బురిడీ

ABN , Publish Date - Jul 09 , 2025 | 12:59 AM

: తక్కువ ధరకు అసలైన బంగారం ఇస్తామంటూ అమాయకులను మోసం చేస్తూ నకిలీ బంగారం అంటగట్టి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న అంతర్‌రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

నకిలీ బంగారంతో ప్రజలకు బురిడీ

అంతర్‌రాష్ట్ర దొంగల అరెస్టు

నిందితుల నుంచి రూ.2.25 లక్షల నగదు స్వాధీనం

నిడమనూరు, జూలై 8(ఆంధ్రజ్యోతి): తక్కువ ధరకు అసలైన బంగారం ఇస్తామంటూ అమాయకులను మోసం చేస్తూ నకిలీ బంగారం అంటగట్టి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న అంతర్‌రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. హాలియా సీఐ సతీష్‌రెడ్డి, నిడమనూరు ఎస్‌ఐ ఉప్పు సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని ఒంగోలు జిల్లా చీమకుర్తి మండలం మర్రిచెట్టుపాలెం గ్రామానికి చెందిన పోలా నందు అలియాస్‌ ఆనందరావు, ఒంగోలు జిల్లా లింగసముద్రం మండలం జంపరోరిపాలెం గ్రామానికి చెందిన నాగలూరి ప్రకాశం అలియాస్‌ ప్రసాద్‌ ముఠాగా ఏర్పడి నల్లగొండ జిల్లాలోని వివిధ గ్రామాల్లో తిరుగుతూ పాములు పడతాము అంటూ ప్రజలను గుర్తిస్తున్నారు. తమ వద్ద అసలైన బంగారం ఉందని, తక్కువ ధరకే ఇస్తామంటూ ప్రజలను నమ్మిస్తూ వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ నకిలీ బంగారం అంటగడుతున్నారు. గతేడాది నల్లగొండ పట్టణంలో పానగల్‌ వద్ద ఓ వ్యక్తిని ఇదే విధంగా నమ్మించి నకిలీ బంగారం అంటగట్టి డబ్బులతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా వారు ఇదే విధంగా ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ క్రమంలో మే నెలలో నిడమనూరు మండలం గుంటుకగూడెం గ్రామంలో ఓ దంపతులను నమ్మించి నకిలీ బంగారం వస్తువులు ఇచ్చి రూ.3.50 లక్షల నగదుతో ఉడాయించారు. తమకు అంటగట్టిన బంగారు వస్తువులు నకిలీవని గుర్తించిన బాధితులు లబోదిబోమంటూ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు జిల్లా ఎస్పీ ఆదేశాలతో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు పర్యవేక్షణలో విచారణ ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో మంగళవారం మండలంలోని ముకుందాపురం వద్ద పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని విచారించగా నకిలీ బంగారం అంటగట్టి డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న దొంగల ముఠాగా పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద రూ.2.25 లక్షల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన సీఐ సతీష్‌రెడ్డి, ఎస్‌ఐ ఉప్పు సురేష్‌, సీసీఎస్‌ ఇన్స్‌పెక్టర్‌ జితెందర్‌, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, హెచ్‌సీలు వహీద్‌పాషా, పుష్పగిరి, సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ అభినందించారు.

Updated Date - Jul 09 , 2025 | 12:59 AM