Pending Saadabainama Applications: సాదాబైనామాకు సాంకేతిక అడ్డంకులు
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:22 AM
సాదాబైనామా దరఖాస్తుల అంశం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. నాలుగేళ్లుగా నిరీక్షించిన దరఖాస్తుదారులకు కొత్త చట్టంతో పరిష్కారం దొరుకుతుందని ఆశించినా ఫలితం...
ఉమ్మడి జిల్లా నుంచి కొత్త జిల్లాకు దరఖాస్తు బదిలీ వీలుకాని పరిస్థితి
మీ సేవలో విస్తీర్ణం తప్పు పడినా... సరిదిద్దేందుకు వెసులుబాటు లేదు
సాఫ్ట్‌వేర్ లోపంతో ఒక్కో దరఖాస్తుకు వందల సర్వే నంబర్లు చూపుతున్న పోర్టల్
9 లక్షలకు పైగా పెండింగ్ దరఖాస్తులు
ఇప్పటిదాకా పరిష్కరించినవి కేవలం 5,295
హైదరాబాద్, నవంబరు 21 (ఆంధ్ర జ్యోతి): సాదాబైనామా దరఖాస్తుల అంశం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. నాలుగేళ్లుగా నిరీక్షించిన దరఖాస్తుదారులకు కొత్త చట్టంతో పరిష్కారం దొరుకుతుందని ఆశించినా ఫలితం అంతంతమాత్రంగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా ఇప్పటి వరకు క్రమబద్ధీకరణకు నోచుకున్నవి కేవలం 5,295 మాత్రమే. సాంకేతిక సమస్యలు ఎదురవుతుండడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఉమ్మడి జిల్లాల్లో పెట్టుకున్న దరఖాస్తును ప్రస్తుతం దరఖాస్తుదారు ఉన్న జిల్లాకు బదిలీ చేయాలంటే పోర్టల్‌లో అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రతి జిల్లాలో ఈ తరహా కేటగిరీ కింద పదుల సంఖ్యలో దరఖాస్తులు ఉన్నాయని, వాటిని ఆయా జిల్లాల పరిధిలోకి బదలాయించేందుకు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని కోరినా సీసీఎల్‌ఏ నుంచి స్పందన లేదని క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు విస్తీర్ణంలో తప్పులను గుర్తించి.. వాటిని సవరించాలని చూసినా అందుకు కూడా సాఫ్ట్‌వేర్‌లో వెసులుబాటు లేదని చెబుతున్నారు. దరఖాస్తు చేసుకునే సమయంలో మీ సేవా కేంద్రాల్లో జరిగిన పొరపాట్లను ఇప్పుడు సరిదిద్దలేకపోతున్నామని పేర్కొంటున్నారు. పరిష్కరించే అవకాశం ఉన్న దరఖాస్తులను సైతం మండలస్థాయి రెవెన్యూ అధికారులు ఏదో ఒక సాకుతో పక్కన పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అఫిడవిట్ అవసరం లేదని సీసీఎల్‌ఏ స్పష్టత ఇచ్చినా కొన్నిచోట్ల దరఖాస్తులను తిరస్కరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అధికారుల్లో గందరగోళం
పోర్టల్‌లో సాంకేతిక లోపం వల్ల సాదాబైనామా దరఖాస్తులకు, సర్వే నంబర్లకు పొంతన లేకుండాపోయిందని అధికారులు చెబుతున్నారు. ఒక్కో దరఖాస్తుకు వందలకొద్దీ సర్వే నంబర్లు కనిపిస్తున్నాయని, ఈ సమస్యను ఎలా అధిగమించాలో అర్థం కావడం లేదని అదనపు కలెక్టర్లు తలపట్టుకుంటున్నారు. తమ జిల్లాల్లో ఉన్న దరఖాస్తులకు, చూపుతున్న సర్వే నంబర్లకు సంఖ్యాపరంగా భారీ వ్యత్యాసం కనిపిస్తోందని, సాంకేతిక లోపం వల్లనే ఈ సమస్య తలెత్తిందని వారు చెబుతున్నారు. సీసీఎల్‌ఏ లెక్కల ప్రకారం 9,00,880 సాదాబైనామా దరఖాస్తులు ఉంటే.. వాటికి 11,49,316 సర్వే నంబర్లు కనిపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో దరఖాస్తులు 15 వేలు ఉంటే.. సర్వే నంబర్లు 22 వేలు కనిపిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 51,347 దరఖాస్తులు ఉంటే 73,797 సర్వే నంబర్లు, సిద్దిపేటలో 44 వేల దరఖాస్తులకు 61,180 సర్వే నంబర్లు ఉన్నాయి. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో అధికారులు గందరగోళానికి గురవుతున్నారు. ఇలా ఉంటే ఎలా క్లియర్ చేయాలని కొన్ని జిల్లాల అధికారులు ప్రశ్నిస్తున్నారు. అన్ని సర్వే నంబర్లు క్లియర్ చేయాలని, దరఖాస్తుదారు పేర్కొన్న సర్వే నంబరును గుర్తించి చట్టబద్ధమైన అనుమతులు ఇవ్వాలని సూచించడంతో కిందిస్థాయి అధికారులు నిర్ణయం తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. సర్వే నంబర్ల విషయంలో సాంకేతిక సమస్యలను తొలగించి స్పష్టత ఇవ్వాలని తహసీల్దార్లు, అదనపు కలెక్టర్లు కోరుతున్నారు.