Share News

Pending Bills: పంచాయతీల పెండింగ్‌ బిల్లులు 531కోట్లు

ABN , Publish Date - Dec 28 , 2025 | 07:06 AM

గ్రామాల్లో సీసీ రోడ్లు, క్రీడా ప్రాంగణాలు, తాగునీటి మోటార్ల ఏర్పాటు, పైప్‌లైన్‌ లీకేజీల మరమ్మతులు, పారిశుధ్య పనులను సొంత డబ్బుతో చేయించడమే అప్పటి సర్పంచ్‌లకు శాపంగా మారింది.

Pending Bills: పంచాయతీల పెండింగ్‌ బిల్లులు 531కోట్లు

  • వీటిలో 90శాతం పైగా అప్పటి సర్పంచ్‌లు చేసిన పనులే

  • ఏళ్లుగా బిల్లులు విడుదల కాకపోవడంతో సతమతం

  • ఇప్పటికైనా మంజూరు చేయాలంటూ ఆందోళన బాట

హైదరాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో సీసీ రోడ్లు, క్రీడా ప్రాంగణాలు, తాగునీటి మోటార్ల ఏర్పాటు, పైప్‌లైన్‌ లీకేజీల మరమ్మతులు, పారిశుధ్య పనులను సొంత డబ్బుతో చేయించడమే అప్పటి సర్పంచ్‌లకు శాపంగా మారింది. 2019 నుంచి 2024 (ఫిబ్రవరి) మధ్య కాలంలో గ్రామాల్లో చేయించిన పనులకుగాను పంచాయతీలకు రూ.531కోట్లు చెల్లించాల్సి ఉందని తేలింది. సమాచార హక్కు చట్టం కింద రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య పెట్టుకున్న దరఖాస్తుకు సమాధానం వచ్చింది. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం వెచ్చించిన మొత్తాల్లో 90శాతంపైగా అప్పటి సర్పంచ్‌లే సొంతంగా భరించారు. నాడు 2019లో సర్పంచ్‌లు కొలువుదీరగా... కొంతకాలం పాటు చెల్లింపులు ఆశాజనకంగానే జరిగాయి. 2020-2021లో కరోనా విజృంభణ తర్వాత రెండేళ్లపాటు బిల్లుల చెల్లింపులన్నీ ఆగిపోయాయి. అవి క్రమంగా పెరిగిపోయి.. పాలకవర్గాల గడువు ముగిసే నాటికి రూ.531కోట్లకు చేరాయి. ఇందులో రూ.500కోట్ల దాకా సర్పంచ్‌లు సొంతంగా వెచ్చించిన నిధులేనని తెలుస్తోంది. గ్రామాల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన నేపథ్యంలోనైనా పాత బిల్లులు విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఆందోళన బాట పట్టేందుకు మాజీ సర్పంచ్‌లు సిద్ధమవుతున్నారు. ఈనెల 29న చలో అసెంబ్లీ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

చలో అసెంబ్లీ 29న నిర్వహిస్తాం

2019 నుంచి 2024 వరకు గ్రామాల్లో చేయించిన పనులకు రూ.531కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. బిల్లుల సాధన కోసం 29న చలో అసెంబ్లీ నిర్వహించనున్నాం. ఇప్పటికైనా బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

- సుర్వి యాదయ్యగౌడ్‌, తెలంగాణ సర్పంచ్‌ల సంఘం జేఏసీ అధ్యక్షుడు

Updated Date - Dec 28 , 2025 | 07:06 AM