Share News

Cough Syrup Warning: దగ్గు.. వారంలో అదే తగ్గు!

ABN , Publish Date - Oct 05 , 2025 | 05:22 AM

మీ ఇంట్లో పిల్లలు విపరీతంగా దగ్గుతున్నారా..! ఏమవుతుందోనని.. ఏదో ఒక దగ్గు సిరప్‌ తెచ్చి ఓ చెంచాడు తాగించేస్తున్నారా..! అయితే కాస్తా ఆగండి..

Cough Syrup Warning: దగ్గు.. వారంలో అదే తగ్గు!

  • చిన్నారులకు దగ్గు మందుతో సమస్యలు

  • కాంబినేషన్‌ డ్రగ్‌తో మరింత ప్రమాదం

  • పిల్లల అవయవాలపై దుష్ప్రభావాలు..

  • మందులు వాడకున్నా వారంలో దగ్గు తగ్గుతుంది: వైద్యులు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): మీ ఇంట్లో పిల్లలు విపరీతంగా దగ్గుతున్నారా..! ఏమవుతుందోనని.. ఏదో ఒక దగ్గు సిరప్‌ తెచ్చి ఓ చెంచాడు తాగించేస్తున్నారా..! అయితే కాస్తా ఆగండి.. ఆ దగ్గు మందే పిల్లలకు ప్రాణ సంకటంగా మారవచ్చు. పెద్దలా మాదిరి చిన్నారులకు దగ్గు మందు వేస్తే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెండేళ్ల లోపు పిల్లలకు అసలు దగ్గు మందు వద్దని కేంద్రం కూడా ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేస్తున్నారు. పిల్లలు దగ్గుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాధారణంగా ఆ సమస్య ఆరేడు రోజుల్లో అదే తగ్గిపోతుందని చెబుతున్నారు. అందుకోసం ఏవో మందులు వాడి ఇబ్బందులపాలు కావద్దని సూచిస్తున్నారు. పిల్లలకు సాధారణంగా జలుబు, శ్వాసకోశ సమస్యలతో విపరీతమైన దగ్గు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. నవజాత శిశువులు, బడికి వెళ్లే చిన్న పిల్లలకు ఏడాదిలో ఆరేడు సార్లు ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు. దీనివల్ల 2, 3 రోజుల పాటు జ్వరం, దగ్గు, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, నిద్ర లేకపోవడం, ఆయాస పడడం వంటి అవస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కానీ శరీరంలో ఆ వైరస్‌, బ్యాక్టీరియాలను ఎదుర్కొని తట్టుకునే శక్తి సాధారణంగా ఉంటుందని.. దీంతో ఆరేడు రోజుల్లో సమస్యలు తగ్గిపోతాయని వైద్యులు వివరిస్తున్నారు. ఇలాంటి సమయంలో పిల్లలకు ఇంటి వైద్యం చేయొచ్చంటున్నారు. అప్పటికీ తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.


2.jpg

కాంబినేషన్‌ డ్రగ్‌తో ముప్పు

పలు రకాల సమస్యల నివారణకు దగ్గు మందు లో కాంబినేషన్‌ డ్రగ్స్‌ ఉంటాయి. తెలియకుండా వాడితే పిల్లలకు ప్రాణాంతకమవ్వవచ్చు. దగ్గు మందులో జ్వరాన్ని తగ్గించే పారాసిటమాల్‌ కూడా ఉంటుంది. అయితే పిల్లలకు జ్వరం లేకపోయినా ఈ రకం కాంబినేషన్‌ సిరప్‌ ఇస్తే తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. కొన్నిసార్లు అధిక డోసు కారణంగా అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుంది. గుండె స్పందనల్లో తేడా వస్తుంది. అందుకే పిల్లలకు నాలుగేళ్ల వరకు ఎలాంటి కాంబినేషన్‌ డ్రగ్‌ వాడొద్దు.

- డాక్టర్‌ అనుపమ యెర్రా, పిల్లల వైద్యురాలు, రెయిన్‌బో ఆస్పత్రి

23.jpg

ఆయాసం వచ్చినా దగ్గు మందేనా..?

పిల్లలకు ఆయాసం వస్తే కూడా కొందరు దగ్గు మందును వాడుతున్నారు. దగ్గు మందులో ఏ ఇన్‌గ్రీడియెన్స్‌ ముందు తెలుసుకోవాలి. అవి ఎంత మేరకు ప్రమాదమో పరిశీలించాలి. పిల్లలకు దగ్గు మందు వాడొద్దని క్లినిక్‌ ట్రయల్స్‌లో కూడా నిర్ధారించారు. దగ్గు మందులతో వారి కిడ్నీలపై ప్రభావంపై పడుతుంది. కొన్నిసార్లు డయాలసిస్‌ చేస్‌ సమయం ఉండదు.

- డాక్టర్‌ రవి కుమార్‌, పిల్లల వైద్యుడు, నిలోఫర్‌ ఆస్పత్రి

కోల్ర్డిఫ్‌ సిర్‌పపై ప్రజలకు తెలంగాణ సర్కారు అలెర్ట్‌..

గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో దగ్గు మందు కోల్ర్డిఫ్‌ సిరప్‌ వాడటంతో పలువురు చిన్నారులు మృత్యువాత పడిన నేపథ్యంలో తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) అప్రమత్తమైంది. కోల్ర్డిఫ్‌ సిరప్‌ బ్యాచ్‌ నంబర్‌ ఎస్‌ఆర్‌-13 వాడకాన్ని నిషేధిస్తున్నామని.. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఓ ప్రకటన విడుదల చేసింది.

Updated Date - Oct 05 , 2025 | 10:20 AM