Cyber Crimes: పేరు విదేశీ కొలువు.. బలవంతపు సైబర్ నేరాలు
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:39 AM
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగ యువతకు గాలం వేసి... లావోస్, థాయిలాండ్ వంటి దేశాలకు తీసుకెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు..
ప్రధాన సూత్రధారిపై పీడీయాక్టు.. అరెస్టు
సైబర్ నేరంపై రాష్ట్రంలో తొలిసారి పీడీయాక్టు
సుభా్‌షనగర్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగ యువతకు గాలం వేసి... లావోస్, థాయిలాండ్ వంటి దేశాలకు తీసుకెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న కేసులో ప్రధాన సూత్రధారి కోలనాటి నాగశివపై పీడీ యాక్టు కింద నిజామాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ నేరాలపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారని నిజామాబాద్ నగర పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఆదివారం తెలిపారు. పలువురు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతోపాటు నాగశివను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించామన్నారు. నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కొంత మంది నిరుద్యోగులను విదేశాల్లో అధిక వేతనాలకు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి లావోస్, థాయిలాండ్ వంటి దేశాలకు పంపి.. అక్కడికెళ్లాక పాస్‌పోర్టు స్వాధీనం చేసుకునే వాడని సాయి చైతన్య చెప్పారు. అక్కడ బలవంతంగా సైబర్ మోసాలు చేయించేవాడన్నారు. సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలుంటాయని సాయి చైతన్య.. అధిక వేతనాలతో ఉద్యోగాలిప్పిస్తామని మోసపూరిత వాగ్ధానాలతో యువతతో సైబర్ నేరాలకు పాల్పడేలా చేస్తే ఉపేక్షించది లేదన్నారు.