MLA Janampalli Anirudh Reddy: ఎమ్మెల్యే అల్టిమేటంతో కదిలిన పీసీబీ
ABN , Publish Date - Sep 28 , 2025 | 02:32 AM
కాలుష్యాన్ని విడుదల చేస్తున్న అరబిందో ఫార్మాపై చర్యలు తీసుకుంటారా, లేదంటే ఆ పరిశ్రమను తగలబెట్టమంటారా..
అరబిందో ఫార్మాలో తనిఖీలు.. నీటి నమూనాల సేకరణ
జడ్చర్ల, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘కాలుష్యాన్ని విడుదల చేస్తున్న అరబిందో ఫార్మాపై చర్యలు తీసుకుంటారా, లేదంటే ఆ పరిశ్రమను తగలబెట్టమంటారా’ అంటూ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఇచ్చిన అల్టిమేటంతో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు కదిలివచ్చారు. శనివారం జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ నరేందర్ ఆధ్వర్యంలోని బృందం అరబిందో ఫార్మాలో తనిఖీలు నిర్వహించింది. తాము రావడానికి ముందు పరిశ్రమలో కలుషిత నీటిని నిల్వ చేసే ట్యాంకులు శుభ్రం చేసి ఉంచడాన్ని అధికారులు గమనించారు. కలుషిత నీటిని పరిశ్రమ బయటకు వదులుతుండడాన్ని గుర్తించారు. పరిశ్రమలో నుంచి నీటిని వదిలేందుకు ఉన్న 8 ఔట్‌లెట్ల వద్ద నీటి నమూనాలను సేకరించారు. తనిఖీల్లో గుర్తించిన వాస్తవ పరిస్థితులపై తెలంగాణ పీసీబీ సభ్య కార్యదర్శి రవినాయక్‌కు నివేదిక ఇస్తామని నరేందర్ తెలిపారు. కాగా, పీసీబీ అధికారులు ఇచ్చే నివేదికలో వాస్తవాలు లేకుంటే అన్నంత పనిచేస్తానని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. పీసీబీ తనిఖీలు చేపట్టడంతో పరిశ్రమను తగలబెడతానన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నానని చెప్పారు.