Patient Falls Into Coma: చికిత్స కోసం వస్తే కోమాలోకి పేషెంట్ !?
ABN , Publish Date - Dec 22 , 2025 | 04:58 AM
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని.. కోలుకుంటాడన్న ఆశతో ఆస్పత్రికి తీసుకువస్తే వైద్యుల నిర్లక్ష్యం వల్ల కోమాలోకి వెళ్లాడంటూ బాధిత...
మత్తు సూది ఇవ్వడంతో పరిస్థితి విషమం
ఆస్పత్రి వద్ద కుటుంబసభ్యుల ఆందోళన
సంగారెడ్డి అర్బన్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని.. కోలుకుంటాడన్న ఆశతో ఆస్పత్రికి తీసుకువస్తే వైద్యుల నిర్లక్ష్యం వల్ల కోమాలోకి వెళ్లాడంటూ బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. కుటుంబసభ్యులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట నాగులపల్లి గ్రామానికి చెందిన ప్రతా్‌పగౌడ్(50)శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స కోసం కుటుంబసభ్యులు ప్రతా్‌పను సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం, గాయాల తీవ్రతను గుర్తించేందుకు సీటీ స్కాన్ తీయాలని వైద్యులు సూచించారు. స్కానింగ్ తీసే సమయంలో పేషెంట్ సహకరించడం లేదని, అందుకే మత్తు ఇంజెక్షన్ ఇచ్చామని వైద్యులు కుటుంబసభ్యులకు తెలిపారు. అయితే , అప్పటి వరకు మంచిగా ఉన్న వ్యక్తి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత క్షణాల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. మత్తుమందు ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని, దీనికి ఆస్పత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలని ఆందోళనకు దిగారు. ఘటనపై ఆస్పత్రి వర్గాలు స్పందిస్తూ.. స్కాన్ తీసే సమయంలో కదలకుండా ఉండేందుకే నిబంధనల ప్రకారం మత్తుమందు ఇచ్చామన్నారు. 24 నుంచి 48 గంటల పాటు పరిస్థితి విషమంగా ఉంటుందని ముందే చెప్పామని ఆస్పత్రి ఎండీ లాలేశ్ వివరణ ఇచ్చారు. కుటుంబీకులు చెసే ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. వైద్యుల సమాధానంతో సంతృప్తి చెందని బంధువులు.. ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా ఆస్పత్రి వద్ద ఆందోళన కొనసాగించారు. అనంతరం పేషెంట్‌ను హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనను నిలువరింపజేశారు.