Road Accident: డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా
ABN , Publish Date - Nov 09 , 2025 | 02:44 AM
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. అందులో ఉన్నవారిని తోటి వాహనదారులు...
మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధం
కారులోని ఆరుగురుని కాపాడిన లారీ డ్రైవర్లు
చిట్యాలరూరల్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. అందులో ఉన్నవారిని తోటి వాహనదారులు, లారీ డ్రైవర్లు ప్రాణాలకు తెగించి కాపాడారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులో జరిగింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వివేక్‌నగర్‌కు చెందిన ప్రకాశ్‌పటేల్ కుటుంబసభ్యులు, బంధువులు రెండు కార్లలో చెన్నైకి బయలుదేరారు. ప్రకాశ్‌పటేల్ తన భార్య, ఇద్దరు కూతుళ్లు, మరో ఇద్దరు బంధువులతో కలిసి ఇన్నోవా కారులో బయలుదేరగా, తన సోదరుడి కుటుంబం మరో కారులో వెనుక వస్తోంది. ఇన్నోవా కారు చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి శివారులోకి రాగానే డివైడర్‌ను ఢీకొట్టి, బోల్తా పడింది. రహదారిపై వెళుతున్న లారీలు, ఇతర వాహనాల డ్రైవర్‌లు, వెనకాలే వస్తున్న ప్రకాశ్‌పటేల్ సోదరుడు గమనించి కారులో ఉన్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురు లారీ డ్రైవర్లు ప్రాణాలకు తెగించి మరీ కారులో ఉన్నవారిని కాపాడారు. కారు దగ్ధమవడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పి, గాయపడిన వారిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.