Share News

Indian Railways: కన్ఫర్మ్‌ టిక్కెట్లలో ప్రయాణ తేదీ మార్చుకోవచ్చు

ABN , Publish Date - Oct 08 , 2025 | 04:08 AM

రైల్వే టిక్కెట్లు కన్ఫర్మ్‌ అయిన తరువాత ప్రయాణ తేదీని మార్చుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం. ఆ టిక్కెట్లను రద్దు చేసుకొని...

Indian Railways: కన్ఫర్మ్‌ టిక్కెట్లలో ప్రయాణ తేదీ మార్చుకోవచ్చు

  • ఎలాంటి రుసుములు ఉండవు

  • రైల్వే శాఖ నూతన సౌకర్యం

  • జనవరి నుంచి అమలు

  • ఆ రోజున టిక్కెట్‌ కన్ఫర్మ్‌పై మాత్రం గ్యారెంటీ ఉండదు

న్యూఢిల్లీ, అక్టోబరు 7: రైల్వే టిక్కెట్లు కన్ఫర్మ్‌ అయిన తరువాత ప్రయాణ తేదీని మార్చుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం. ఆ టిక్కెట్లను రద్దు చేసుకొని, కొత్తది తీసుకోవడం మినహా మార్గం లేదు. టిక్కెటును క్యాన్సిల్‌ చేసుకున్నందుకు కొంత సొమ్మును నష్టపోవాలి. కొత్తగా రిజర్వేషన్‌ చేయించుకుంటే మళ్లీ రుసుము చెల్లించాలి. ఇది ప్రయాణికులకు నష్టం కలిగిస్తుండడంతో రైల్వే శాఖ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. టిక్కెట్‌ కన్ఫర్మ్‌ అయిన తరువాత కూడా ఎలాంటి రసుములు తీసుకోకుండానే ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశం కలిగించనుంది. ఇది జనవరి నెల నుంచి అమల్లోకి రానుంది. దీనిపై రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ మాట్లాడుతూ ‘ప్రస్తుత విధానం అన్యాయమైనది. ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నది కాదు’ అని అన్నారు. అందువల్ల ప్రయాణికులకు మేలు కలిగించే విధానాలను అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. ఎలాంటి రుసుములు లేకుండానే ప్రయాణ తేదీని మార్చుకునే సౌకర్యం కలిగించనున్నట్టు తెలిపారు. అయితే మారిన రోజున టిక్కెట్‌ కన్ఫర్మ్‌ అవుతుందన్న గ్యారెంటీ ఉండదని, ఆ రోజున ఉండే సీట్ల లభ్యతకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ఆ రోజున అదనంగా టిక్కెట్లపై ఛార్జీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే దాన్ని భరించాల్సి ఉంటుందని తెలిపారు. ఇవన్నీ ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుందని చెప్పారు.

Updated Date - Oct 08 , 2025 | 07:20 AM